Begin typing your search above and press return to search.

హోదాపై మ‌రో ముడి వేసిన హ‌రీశ్‌!

By:  Tupaki Desk   |   25 July 2018 5:11 AM GMT
హోదాపై మ‌రో ముడి వేసిన హ‌రీశ్‌!
X
ఐదు కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని తొక్కేయాల‌ని చూడ‌టం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు అంద‌రి మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌.విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ ప్ర‌క‌టించింది నిన్న‌మొన్న‌కాదు. నాలుగేళ్ల‌కు ముందే రాజ్య‌స‌భ‌లో నాటి ప్ర‌ధానిగా ఉన్న మ‌న్మోహ‌న్ సింగ్ తానే స్వ‌యంగా ఏపీకి హోదా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం కార‌ణంగా తెలంగాణ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తింటాయంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న వాద‌నే నిజ‌మే అయితే.. ఆ మాట‌ను ఆ స‌మ‌యంలోనే ఎందుకు చెప్ప‌లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఎగ్గొట్టే విష‌యంలో మోడీ స‌ర్కారు ఎంత క‌ర‌కుగా ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వీరికి తోడుగా కేసీఆర్ నిల‌వ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న మాట నిజ‌మే అయితే.. హోదా విష‌యంలో కేసీఆర్ ఈ తీరులో మాట్లాడ‌తారా? అన్న ప్రశ్న‌ను ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఏపీకి హోదా ఇస్తే.. త‌మ‌కూ ఇవ్వాల‌న్న చిత్ర‌మైన వాద‌న‌ను తెర మీద‌కు తీసుకురావ‌టం ద్వారా.. మీ చుట్టూ ఉన్న రాష్ట్రాలు సైతం ఒప్పుకోవ‌టం లేదు.. మీకు హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాల‌తో పంచాయితీ అన్న భావ‌న క‌లుగ‌జేసే కుట్ర‌లో భాగంగానే కేసీఆర్ నోట మోడీ మాట‌ను చెప్పిస్తున్నార‌న్న విమ‌ర్శ ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వొద్ద‌న్న మాట‌ను మొన్న‌టికి మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టిస్తే.. తాజాగా కేసీఆర్ మేన‌ల్లుడు క‌మ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ నోటి వెంట రావ‌టం గ‌మ‌నార్హం.

అదేమంటే..తెలంగాన ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా ఏపీ వ్య‌వ‌హ‌రించ‌టం లేదా? ప‌్రాజెక్టుల విష‌యంలో ఏపీ మోకాల‌డ్డుతున్న వైనాన్ని ప్ర‌స్తావిస్తున్నారు హ‌రీశ్‌. అయితే.. కేసీఆర్ సర్కారు చేప‌ట్టిన ప్రాజెక్టుల‌ను ఏపీ మాత్ర‌మే వ్య‌తిరేకిస్తే.. అసూయ‌తోనో.. మ‌రో కార‌ణంతోనే అలా చేసింద‌ని చెప్పొచ్చు. కానీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత‌లు సైతం ఎందుకు అడ్డుకుంటున్నారు. ఎందుకు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నార‌న్న విష‌యాన్ని ప్ర‌శ్నించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తే అభివృద్ధి చెందిన సంగారెడ్డి.. ప‌టాన్ చెరు ప్రాంతాల‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌లు ఏపీకి వెళితే మ‌న‌మేం చేయాల‌ని హ‌రీశ్ ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌ది సంప‌న్న రాష్ట్రంగా అదే ప‌నిగా చెప్పుకునే ముఖ్య‌మంత్రి.. ఏపీకి ధీటుగా ప‌రిశ్ర‌మ‌ల‌కు తాయిలాలు ఇవ్వాలి. అయినా.. ప‌క్క‌నున్నోడు బాగు ప‌డే అవ‌కాశం ఉంటే దాన్ని అడ్డుకోవ‌టం గొప్ప‌త‌న‌మా? మీరు.. అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు పెడితే.. మేం కూడా క్రీడాస్ఫూర్తితో ప‌రుగులు తీస్తాం.. ఇద్ద‌రం క‌లిసి తెలుగు ప్ర‌జ‌ల జీవితాల్ని మ‌రింత మెరుగ్గా మారుద్దామ‌నాల్సింది పోయి.. ఏపీకి హోదా ఇస్తే.. మాకూ ఇవ్వాల‌న్న పీట‌ముడి వాద‌న ఎందుక‌న్న విమ‌ర్శ ప‌లువురు తెలంగాణ‌వాదుల నోట వినిపిస్తూ ఉంది.