Begin typing your search above and press return to search.

‘బీజేపీ గెలిస్తే పుదుచ్చెరి ఉండదు.. తమిళనాడులో విలీనం చేస్తారు’

By:  Tupaki Desk   |   19 March 2021 11:30 PM GMT
‘బీజేపీ గెలిస్తే పుదుచ్చెరి ఉండదు.. తమిళనాడులో విలీనం చేస్తారు’
X
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గ‌న‌క గెలిస్తే.. పుదుచ్చెరి ప్ర‌త్యేకంగా ఉండ‌ద‌ని, త‌మిళ‌నాడులో క‌లిపేస్తార‌ని మాజీ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త నెల‌లోనే నారాయ‌ణ స్వామి గ‌వ‌ర్న‌మెంట్ ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ప‌లువురు ఎమ్మెల్యేలను బీజేపీ ఆక‌ర్షించ‌డం.. కాంగ్రెస్‌-డీఎంకే ప్ర‌భుత్వం కూలిపోవ‌డం.. వెంట‌నే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డం.. చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ మాజీ సీఎం.. బీజేపీపై విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగించారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-డీఎంకే-సీపీఐ-వీసీకే పార్టీలు కూట‌మిగా ఉన్నాయి. ఈ కూట‌మికి నారాయ‌ణ స్వామి ఇన్ చార్జ్ గా ఉన్నారు. శుక్ర‌వారం నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. పుదుచ్చెరి విలీనంపై వ్యాఖ్య‌లు చేశారు.

త‌మిళ‌నాడులో పుదుచ్చెరిని క‌లిపేందుకు బీజేపీ కుట్ర చేస్తోంద‌ని, ఈ కుతంత్రాన్ని ప్ర‌జ‌లు సాగ‌నివ్వ‌బోర‌ని అన్నారు. మొత్తం 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చెరిలో ఈ సారి భాగ‌స్వాముల‌కు ఎక్కువ సీట్లు కేటాయించింది కాంగ్రెస్‌. హ‌స్తం పార్టీ కేవ‌లం 14 సీట్ల‌లో బ‌రిలో నిల‌వ‌గా.. డీఎంకేకు ఏకంగా 13 సీట్లు, సీపీఐ, వీసీకేకు చెరో సీటు కేటాయించింది.

ఈ మ‌ధ్య‌నే ప్ర‌భుత్వం కూలిపోవ‌డంతో.. బీజేపీ దుష్ట ప‌న్నాగాల‌తో త‌మ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసింద‌ని, ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని అర్థం చేసుకొని త‌మ వెంట నిల‌వాని కాంగ్రెస్ కూట‌మి కోరుతోంది. మ‌రి, ఏం జ‌రుగుతుంది? ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారు? అన్న‌ది చూడాలి.