Begin typing your search above and press return to search.

చంద్రబాబు అలా చేస్తే సరికొత్త రికార్డే మరి... ?

By:  Tupaki Desk   |   3 Oct 2021 9:30 AM GMT
చంద్రబాబు అలా చేస్తే సరికొత్త రికార్డే మరి... ?
X
చంద్రబాబుని రాజకీయ గండర గండడు అంటారు. ఆయన చాణక్య రాజకీయం ప్రత్యర్ధులను గుక్క తిప్పుకోనీయకుండా చేస్తుంది. బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన ఎత్తులు పై ఎత్తులు ఒక రేంజిలో ఉంటాయి. బాబు ఆలోచించి స్కెచ్ గీయాలే కానీ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టడం ఖాయమనే చెబుతారు. అయితే 2018 నుంచి చంద్రబాబు ఎత్తుగడలు చాలా వరకూ పారలేదు. నాడు మోడీకి బాగా వ్యతిరేకత ఉందని భావించి తప్పులో కాలేసి కమలానికి తలాక్ అనేశారు. ఇక పవన్ పవర్ స్టారిజాన్ని కూడా లెక్కచేయకుండా దూరం పెట్టారు. దాని ఫలితాన్ని కేవలం 23 సీట్ల రూపంలో అనుభవించారు. అయితే 2024 ఎన్నికల నాటికి ఇలాంటి తప్పులు చేయకూడదు అని బాబు భావిస్తున్నారుట.

ఈసారి జగన్ని ఇంటికి పంపాల్సిందే అని బాబు గట్టిగానే డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మళ్ళీ జగన్ కనుక అధికారంలోకి వస్తే శాశ్వతంగా టీడీపీ డోర్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఈ సంగతి అందరి కంటే బాబుకే బాగా తెలుసు. ఎన్టీయార్ చేతుల్లో నుంచి అధికారాన్ని, పార్టీని తన వైపు తీసుకున్న బాబు గడచిన పాతికేళ్ళుగా టీడీపీని ఫ్రంట్ లైన్ లోనే ఉంచుతున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ మార్క్ చెక్కుచెదరకుండా చూసుకుంటున్నారు.

అయితే ఒకసారి అధికారం పోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం. పైగా బాబు వయసు ఇపుడు ఏడు పదులు దాటింది. మరో వైపు చూసుకుంటే కుమారుడు నారా లోకేష్ ఇంకా అంది రావడంలేదు. చూడబోతే సగం పుణ్య కాలం గడచిపోయింది. జగన్ మధ్యాహ్న మార్తాండుడులా ఏపీ రాజకీయ వేదిక మీద చెలరేగిపోతున్నారు. దాంతో ఆయన్ని తట్టుకోవాలంటే మళ్లీ జనం బాటలో పయనించక తప్పదు అని గట్టిగానే బాబు నిర్ణయానికి వచ్చేశారు అంటున్నారు. దాదాపు పదేళ్ల తరువాత‌ విభజన ఏపీకి తొలి సీఎం గా చంద్రబాబు కావడానికి పాయన చేసిన పాదయాత్ర చాల ఉపయోగపడింది. నాడు అరవై ఏళ్ల వయసులో బాబు పాదయాత్ర చేశారు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం 2012 గాంధీ జయంతి వేళ బాబు చేపట్టిన పాదయాత్ర సుదీర్ఘంగా ఉమ్మడి ఏపీని తాకుతూ ఆరు నెలల పాటు సాగింది. చివరికి అదే పవర్ ని బాబు చేతిలో పెట్టింది.

ఇపుడు కూడా నిస్తేజం అయిన పార్టీని బతికించుకోవడానికి, జగన్ చరిష్మాను తగ్గించి తాను జనంలో ఉండడానికి పాదయాత్ర శరణ్యమని బాబు భావిస్తున్నారుట. అయిత బాబు వయసు ఇపుడు 72. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. అంటే నాటికి ఆయన 73కి చేరువ అవుతారు. అంత లేటు వయసులో పాదయాత్ర అంటూ అడుగూ అడుగూ కదిపి బాబు సాగడం అంటే అంతకంటే దుస్సాహసం వేరొకటి ఉండదు అంటున్నారు. కానీ బాబు మాత్రం ససేమిరా అంటున్నారుట. మామూలు ప్రసంగాలు టూర్లు చేస్తే వైసీపీ ముందు అవి ఎందుకూ సరితూగవని ఆయన నిర్ణయానికి వచ్చారట. అందువల్ల విజయమే లక్ష్యంగా ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారని టాక్. ఎన్నికలు ఎపుడు జరిగినా తాను జనంలోనే ఉంటే కచ్చితంగా అది పార్టీకి తనకూ మేలు చేస్తుందని బాబు తలపోస్తున్నారుట. మరి బాబు పాదయాత్ర కనుక చేపడితే అది ఏపీ రాజకీయాల్లో సరికొత్త రికార్డు ని క్రియేట్ చేసినట్లుగానే భావించాలేమో.