Begin typing your search above and press return to search.

ర‌మ‌ణ‌.. గెలిచినా ఓడినా ప‌ద‌వి ఖాయం

By:  Tupaki Desk   |   12 July 2021 11:30 AM GMT
ర‌మ‌ణ‌.. గెలిచినా ఓడినా ప‌ద‌వి ఖాయం
X
30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో కొన‌సాగి.. తెలంగాణ‌లో టీడీపీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన ఎల్‌.ర‌మ‌ణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన లేఖ‌ను ఆయ‌న మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు పంపించారు. రాష్ట్రంలో టీడీపీకి భ‌విష్య‌త్ లేద‌ని ఆల‌స్యంగా గ్రహించిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. సోమ‌వారం టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ర‌మ‌ణ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 16న కేసీఆర్ స‌మ‌క్షంలో నిర్వ‌హించే స‌భ‌లో ఆయ‌న గులాబీ కండువా క‌ప్పుకోనున్నారు.

భూక‌బ్జా కోరు అనే ముద్ర వేసి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు ఈటెల నిష్క్ర‌మ‌ణ‌తో ఖాళీ అయిన బీసీ నేత స్థానాన్ని ర‌మ‌ణ‌తో పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నించి స‌ఫ‌ల‌మయ్యారని రాజకీయ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ర‌మ‌ణ టీఆర్ఎస్‌లో చేరేందుకు ఒప్పుకున్నారు. ఈటెల రాజీనామా చేయ‌డంతో ఖాళీ అయిన హుజూరాబాద్ శాస‌న‌స‌భ స‌భ్యుడి స్థానం కోసం త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఆ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పున పోటీ చేసే ఈటెల‌పై ర‌మ‌ణ‌ను బ‌రిలో దింపేందుకు కేసీఆర్ వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు తెలిసింది. హుజూరాబాద్‌లో కారును న‌డిపే డ్రైవ‌ర్ ర‌మ‌ణే అంటూ ఆయ‌న కార్య‌క‌ర్త‌లు అనుకుంటున్నారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిస్తే కేబినేట్ మంత్రి ప‌ద‌వి ద‌క్కే వీలుంది. ఒక‌వేళ ఓడిపోతే ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌నున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. ఇలా ఎన్నిక‌ల్లో గెలిచినా ఓడినా ప‌ద‌వి ఇస్తామ‌నే ప్ర‌తిపాద‌న చేయ‌డంతోనే ర‌మ‌ణ కారెక్కేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఈ నెల 8న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుతో క‌లిసి ర‌మ‌ణ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో వాళ్ల చ‌ర్చ‌ల ర‌హ‌స్య సారాంశం ఆ ముగ్గురికి త‌ప్ప ఇత‌రుల‌కు తెలిసే వీల్లేదు. ర‌మ‌ణ అనుచ‌ర వ‌ర్గం మాత్రం త‌మ‌ నాయ‌కుడికి మంత్రి ప‌ద‌వి లేదా ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంద‌నే ఆనందంలో మునిగిపోతున్నారు. ఈ నెల మొద‌టి వారంలో జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఎర్ర‌బెల్లి ప‌ల్లెనిద్ర చేశారు. ఆ స‌మ‌యంలోనే ర‌మ‌ణ చేరిక‌కు సంబంధించి స్థానిక నేత‌ల‌తో మాట్లాడి వాళ్ల‌ను స‌ముదాయిచ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే క‌రీంన‌గ‌ర్‌లో తిరుగులేని బీసీ నేత‌గా ఉన్న ఆయ‌న‌.. హుజూరాబాద్‌లో ఈటెల‌పై పోటీ చేస్తే త‌ప్ప‌కుండా టీఆర్ఎస్‌కే విజ‌యం ద‌క్కుతుంద‌నే అభిప్రాయాల‌నూ స్థానిక నేత‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో ఎర్ర‌బెల్లి విజ‌య‌వంత‌మ‌య్యారు.

టీఆర్ఎస్‌లో ర‌మ‌ణ చేరిక‌తో తెలంగాణ టీడీపీకి భ‌విష్య‌త్ లేకుండా చేయాల‌నే కేసీఆర్ మ‌రో ఆలోచ‌న కూడా కార్య‌రూపం దాల్చ‌నుంది. ఈ ప‌రిస్థితుల్లోనూ ర‌మ‌ణ రాజీనామాపై చంద్ర‌బాబు నాయుడు స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మూడు ద‌శాబ్దాలుగా టీడీపీతోనే ఉంటూ.. చంద్ర‌బాబు న‌మ్మిన బంటుగా మారిన ర‌మ‌ణ ఇప్ప‌టికే రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఇలాంటి నాయ‌కుడు పంపిన రాజీనామా లేఖ‌పై బాబు స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించేదే. అదే 2017లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన‌ప్ప‌డు స్వ‌యానా బాబును క‌లిసి రాజీనామా లేఖ స‌మ‌ర్పించి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.