Begin typing your search above and press return to search.

కేసును నేనే విచారిస్తుంటే సీఎంను జైలుకు పంపేవాడిని.. సుప్రీం మాజీ జడ్జి సంచలనం!

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:06 AM GMT
కేసును నేనే విచారిస్తుంటే సీఎంను జైలుకు పంపేవాడిని.. సుప్రీం మాజీ జడ్జి సంచలనం!
X
ఏపీ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ వి. గోపాలగౌడ్. ఎన్నికల్లో విజయం సాధించే వరకు అమరావతే ఏపీ రాజధానిగా పేర్కొన్న వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం అందుకు భిన్నంగా ఒక రాజధాని కాదు మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవిని అందుకోవటంతో పాటు.. అసెంబ్లీ తీర్మానం పేరుతో ఆయన తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అమరావతిలో 35 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వానికి ఇచ్చిన రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి వెయ్యి రోజులైంది.

ఈ నేపథ్యంలో అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయాన్ని తీసుకున్న జగన్ సర్కారు తీరును.. అమరావతిగా ఏపీ హైకోర్టు ధర్మాసనం వెల్లడించిన తీర్పు అనంతరం జరుగుతున్న పరిణామాలపై జస్టిస్ వి. గోపాల గౌడ్ ఒక ప్రముఖ మీడియాకు తన అభిప్రాయాన్ని ఫోన్ లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకూ ఆయన నోటి నుంచి.. 'ఈ కేసును నేనే విచారిస్తుంటే ముఖ్యమంత్రిని కచ్ఛితంగా జైలుకు పంపేవాడిని' అన్న మాటలు ఎందుకు వచ్చాయి? దానికి జస్టిఫికేషన్ ఏమిటి? అన్న అంశంలోకి వెళితే..

'ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని. మూడు రాజధానులపై చట్టం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు విస్పష్టమైన తీర్పును ఇచ్చింది. దాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నందుకు ముఖ్యమంత్రి.. సంబంధిత శాఖ మంత్రి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి వారందర్నీ జైలుకు పంపాలి' అని పేర్కొన్నారు.
తన వ్యాఖ్యలను కొనసాగించిన ఆయన.. "నేనే ఆ కేసును విచారిస్తుంటే ముఖ్యమంత్రిని కచ్ఛితంగా జైలుకు పంపించేవాడిని. రాజధానిపై హైకోర్టు తీర్పు వెలువడి ఆరు నెలలైనా ఇంకా అమలు చేయకపోవడం.. మూడు రాజధానులే తమ విధానమని మంత్రులు మాట్లాడటం న్యాయస్థానం పట్ల ఉద్దేశపూర్వక ధిక్కారం.

అవిధేయత గానే భావించాల్సి ఉంటుంది" అని మండిపడ్డారు. 'రాజధానిపై హైకోర్టు తీర్పు అమలు చేయకుండా ఉండటానికి ఏమేం చేయాలో అవన్నీ ప్రభుత్వం చేస్తోంది. కోర్టు ధిక్కరణ కింద సీఎంతో సహా బాధ్యులందరికీ సమన్లు జారీ చేసి కోర్టుకు పిలిపించాలి. కోర్టు తీర్పును ఉల్లంఘించినందుకు.. అబద్ధాలు చెబుతున్నందుకు వారందర్నీ జైలుకు పంపాలి. ముఖ్యమంత్రికి వారెంట్ ఇచ్చేందుకు పోలీసులు ముందుకు రాకపోతే ఈ-మొయిల్, వాట్సాప్ ద్వారా పంపాలి' అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తన నిర్ణయాన్ని అమలు చేయాల్సిన వేళ.. అవసరమైతే కోర్టు సీఆర్పీఎఫ్ సహకారం తీసుకోవాలన్న ఆయన న్యాయమూర్తులు ధైర్యంగా వ్యవహరించాలన్నారు. 'అమరావతి కేసుల్లో హైకోర్టు అన్ని అంశాల్నీ కూలంకషంగా పరిశీలించి నిర్దిష్టమైన తీర్పు చెప్పింది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయటం కుదరదు. మూడు రాజధానులపై చట్టం చేసే అధికార పరిధి శాసన సభకు లేదు. హైకోర్టు తీర్పు చెప్పి ఆర్నెల్లైంది. సుప్రీంకోర్టు స్టే లేనప్పుడు హైకోర్టు తీర్పే అమల్లో ఉంటుంది. ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవటం ముమ్మాటికీ కోర్టును ఉద్దేశపూర్వకంగా ధిక్కరించటమే' అని స్పష్టం చేశారు.

రాజధాని నిర్మాణానికి నిధులు లేవని ప్రభుత్వం తప్పించుకుందామనుకుంటే కుదరదన్న ఆయన.. మధ్యప్రదేశ్ లోని రత్లాం మున్సిపాలిటీ కేసులో 1980లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు అమరావతికీ వర్తిస్తుందన్నారు. రత్లాం మున్సిపాలిటీలో మురుగు కాల్వలు పొంగి పొర్లుతున్నా.. పాలకమండలి పట్టించుకోవటం లేదని కొందరు కోర్టు వెళ్లిన వైనాన్ని ఉదహరిస్తూ.."వసతుల కల్పనకు డబ్బుల్లేవని మున్సిపాలిటీ చెబితే.. అలా చెప్పి తప్పించుకోలేరని.. అవసరమైతే రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించాలని జస్టిస్ కృష్ణయ్యర్ స్పష్టం చేశారు. ఆదాయ వనరులను సమకూర్చుకోవటం..

మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీది.. ప్రభుత్వానిది. సీఆర్డీఏ దగ్గర డబ్బుల్లేవని.. రుణం కోసం బ్యాంకుల్ని అడుగుతున్నామని తాత్సారం చేస్తే కుదరదు. ప్రభుత్వం ఇప్పటికే చాలా అప్పులు చేసింది. కావాలంటే ఇంకా చేయండి. రాజధానిని మాత్రం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోర్టు స్పష్టంగా ఆదేశించాలి" అని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.