Begin typing your search above and press return to search.

ఇది వీడితే.. మహమ్మారిపై జయమే ఇక !

By:  Tupaki Desk   |   6 Sep 2020 6:30 AM GMT
ఇది వీడితే.. మహమ్మారిపై జయమే ఇక !
X
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగే కొద్దీ మనుషుల్లో భయాలు అంతకన్నా పెరుగుతున్నాయి. కరోనా కన్నా భయమే భూతంలా కనిపిస్తోంది. చైనా, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ప్రబలిన కరోనా తో పోలిస్తే మనదేశంలో వ్యాపిస్తున్న కరోనా అంత తీవ్రమైనది కాదు. ఆ దేశాల కన్నా మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంటోంది. కరోనా వచ్చిందంటే చాలు సగం మంది భయంతోనే చనిపోతున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. ముందు రోజు కూడా ఆసుపత్రికి హుషారుగా నడుచుకుంటూ వచ్చిన వాళ్లు కూడా టెస్టుల్లో కరోనా సోకింది అని తెలిస్తే ఒక్కరోజులోనే చనిపోతున్నారు.

నిజానికి మన దేశం లోకి కరోనా ప్రవేశించకముందే.. అందరూ దాన్నో భూతంలా చూపిస్తూ వచ్చారు. అదేమీ అంత భయంకరం కాదు. పోరాడి కోలుకుందాం అని చెప్పే వాళ్లే కనిపించలేదు.మొదట్లో అయితే కర్మ కాలి ఎవరికైనా కరోనా వస్తే.. ఇక వారిని చూసి అంతా పారిపోయేవారు. వాళ్ళకు అల్లంత దూరాన ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల వల్లే మనుషుల్లో కరోనా అంటే ఓ భయం ఏర్పడి పోయింది.

అంతవరకు మనతో సన్నిహితంగా గడిపినవారికి కరోనా వస్తే ఇక అంతే. నేనింత వరకూ మాట్లాడా.. నాకు కూడా వస్తుందేమో.. ఇంట్లో పిల్లల్ని దగ్గరికి తీశా.. నా వల్ల వాళ్లకు ఏమవుతుందో అని కంగారు పడుతున్నారు. ఇక ఆఫీసుల్లో, పని చేసే చోట దాదాపు అంతా ఒకే సమయంలో భోజనం చేస్తుంటారు. ఏ కూరనో, రసమో, పెరుగో షేర్ చేసుకోవడం మామూలే. వీళ్ళలో ఏ ఒక్కరైనా కోవిడ్ బారిన పడితే ఇక అంతే. మనకు కూడా వస్తుందేమోనని మదన పడుతున్నారు.

ఏ కారులోనో, బైకులోనో ఎవరికైనా లిఫ్ట్ ఇస్తుంటాం. తెలిసిన వాళ్ళను తీసుకెళ్తుంటాం. ఇలా తీసుకెళ్లినవారికో, లేదంటే లిఫ్ట్ ఇచ్చినోళ్లో వ్యాధి బారిన పడితే ఇక అంతే సంగతులు. నాక్కూడా వస్తుందేమో నంటూ ఒకటే టెన్షన్. ఇలా భయాలతో తినీ తినక, నిద్ర రాక గడపడం కంటే ఒకసారి టెస్ట్ చేయించుకుంటే చాలు. ఉన్న ఆందోళన దూరం అవుతుంది. ఒకవేళ వైరస్ బారిన పడ్డా భయపడకుండా ఉంటే చాలు అదే సగం మనల్ని రక్షిస్తుంది. ఒక వేళ ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ముందు జాగ్రత్తగా వాటిని నియంత్రణలో ఉంచుకుంటే కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.