Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ మంత్రి పేరు చెప్పి ఆమె సూసైడ్ య‌త్నం

By:  Tupaki Desk   |   22 Sep 2018 9:07 AM GMT
టీఆర్ ఎస్‌ మంత్రి పేరు చెప్పి ఆమె సూసైడ్ య‌త్నం
X
తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తుల‌ బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. టికెట్లు ఖరారైన అభ్యర్థులు ప్రచారపర్వం కొనసాగిస్తుంటే - భంగపడ్డ వారు తామేమి తక్కువ కాదన్నట్లు తమ అనుచరులతో నిరసన ర్యాలీలు - సమావేశాలు నిర్వహిస్తూ తమ బలాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా తెలంగాణ కోసం ప్రాణాత్యాగం చేసిన శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌రమ్మ మ‌రో రూపంలో త‌మ ఆవేద‌న‌ - డిమాండ్‌ ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. త‌నకు హుజూర్‌ నగర్‌ టికెట్‌ దక్కకుంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని ఆమె ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంత‌రం శంక‌ర‌మ్మ మీడియాతో మాట్లాడుతూ ఉద్యమంలో తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడై ఉద్యమానికి జీవం పోశాడని - అమరుల కుటుంబాల పక్షాన హుజూర్‌ నగర్‌ సీటును కేటాయించాలని కోరారు. మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రవర్తనతో తాను విసిగిపోయానని - టీఆర్ ఎస్‌ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్‌ నగర్‌ టికెట్‌ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ - మంత్రులు కేటీఆర్ - హరీశ్‌ రావు అనుకూలంగా ఉన్నారని, అయితే, మంత్రి జగదీశ్‌ రెడ్డి మాత్రం అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. కార్యకర్తల బలం లేదని అధిష్టానానికి అసత్యాలు చెప్పి టికెట్ రాకుండా చేశార‌ని ఆరోపించారు. త‌నకు హుజూర్‌ నగర్‌ టికెట్‌ దక్కకుంటే మంత్రిపై సూసైడ్‌ నోటు రాసుకుని ఎల్బీ నగర్‌ రింగ్‌ రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని ప్ర‌క‌టించారు.