Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌లో మోడీ గెలిచాడో... మ‌న ప‌ని అంతే!

By:  Tupaki Desk   |   8 May 2018 2:30 PM GMT
క‌ర్ణాట‌క‌లో మోడీ గెలిచాడో... మ‌న ప‌ని అంతే!
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌లు. దేశ‌పు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య కానున్నాయా? క‌ర్ణాట‌క‌లో బీజేపీకి ప‌డే ప్ర‌తి ఓటు ద‌క్షిణాది రాష్ట్రాల వినాశ‌నానికి దారితీస్తుందా? అవును. బీజేపీకి ఈ ఎన్నిక‌లు కీలకం. కానీ... ద‌క్షిణాది రాష్ట్రాల‌కు మాత్రం చాలా చాలా కీలకం. ఎందుకంటే... ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ గెల‌వ‌డం అంటే అది మ‌న‌కు తీర‌ని న‌ష్ట‌మే. ఇక్క‌డ మ‌నం అంటే ద‌క్షిణాది రాష్ట్రాలు.

దేశంలో ప్ర‌స్తుతం 545 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు (లోక్‌ స‌భ‌) ఉన్నాయి. వీటిలో 543 మంది ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల ద్వారా లోక్‌ స‌భ‌లో అడుగుపెతారు. స‌మాఖ్య వ్య‌వ‌స్థ క‌లిగిన భార‌త‌దేశంలో ప‌న్నుల వ్య‌వ‌స్థ అటు కేంద్రం-ఇటు రాష్ట్రం రెండింటి చేతిలో ఉంది. అయితే, జీఎస్టీ అనంత‌రం ఏ ప‌న్ను అయినా స‌గం నేరుగా కేంద్రానికి వెళ్ల‌నుంది. కానీ రాబోయే రోజుల్లో ద‌క్షిణాది నుంచి కేంద్రానికి వెళ్లిన ఆ డ‌బ్బులు ఇక తిరిగిరాక‌పోవ‌చ్చు. ఇది అర్థం చేసుకోవాలంటే... నియోజ‌క‌వ‌ర్గాల క‌థ తెలుసుకోవాలి.

మూడు నాలుగు ద‌శాబ్దాల క్రితం దేశ జ‌నాభా విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో జ‌నాభా నియంత్ర‌ణ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కేంద్రం సంక‌ల్పించింది. దీనిని గ‌ట్టిగా అమ‌లు చేయాల‌ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. దీంతో ఇది ప్ర‌భుత్వ విధానంలా మారింది. స‌హ‌జంగానే చైత‌న్య‌వంతులు అయిన ద‌క్షిణాది ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం పిలుపును అర్థం చేసుకున్నాయి. అయితే, ఉత్త‌రాది రాష్ట్రాల ప్ర‌జ‌లు దీనిని పెడ‌చెవిన పెట్టాయి. అస‌లే ద‌క్షిణాదిలో రాష్ట్రాల సంఖ్య త‌క్కువ‌. పైగా జ‌నాభా పెరుగుద‌ల కూడా ఆగిపోవ‌డంతో ఉత్త‌రాదికి-ద‌క్షిణాదికి జ‌నాభా సంఖ్య‌లో విప‌రీత‌మైన అంత‌రం ఏర్ప‌డింది. ఇది స‌మాజానికి మేలు చేసింది. జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంచింది. కానీ ప్ర‌జ‌లు మంచిని అనుస‌రించ‌డ‌మే ఇపుడు ప్ర‌మాదంగా మారే దుస్థితి వ‌చ్చింది. దీనికి కార‌కుడు... మ‌నం ఓట్లేసి గెలిపించిన ప్ర‌ధాని మోడీ. దేశం ముందుకు వెళ్లాలంటే అవినీతిలో కుంగిపోయిన‌ కాంగ్రెస్ ను త‌ర‌మాల‌న్న అత‌ని మాట‌లు న‌మ్మి జ‌నం మోసం పోయారు. నిజానికి అత‌ను చెప్పి ఉత్త‌మ పాల‌నా విధానాలేవీ అనుస‌రించ‌క‌పోగా... డీమానిటైజేష‌న్‌ - అసంబద్ధంగా రూపొందించిన జీఎస్టీ అమ‌లు - ఫిక్స్‌ డ్ డిపాజిట్ బిల్లు వంటి వాటితో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై నెగెటివ్ ప్ర‌భావాన్ని చూపే నిర్ణ‌యాలు తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక రాజ‌కీయ బేధాభిప్రాయాల‌ను వాడుకుని పార్టీల‌ను చీల్చి వాపును బ‌లంగా చూపిన మోడీ క‌ర్ణాట‌క‌లో గెలిచి వ‌చ్చే లోక్‌ స‌భ‌ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపించద‌ల‌చుకున్నారు. నిజంగా క‌ర్ణాట‌క‌లో బీజేపీ క‌నుక గెలిస్తే... వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో మోడీకి అనుకూల ప్ర‌చారం జ‌రిగే అవకాశం ఉంది. అదే జ‌రిగితే అత‌ను ప్ర‌ధాని అయ్యే అవ‌కాశ‌మూ ఉంటుంది.

ఇంత‌కీ మోడీ వ‌స్తే ద‌క్షిణాదికి ఏంటి ప్రాబ్లం అంటే... 15వ ఆర్థిక సంఘానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో కేంద్రం నిధుల పంపిణికి 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. మోడీ దీనిని వెన‌క్కు తీసుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం 1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనివల్ల అప్ప‌టి జ‌నాభా దామాషాన మ‌న‌కు నిధులు వ‌స్తున్నాయి. 2011 జనాభా లెక్కలను.. ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకంటే… లోక్‌సభ సీట్ల పునర్విభజన కూడా అదే వ‌ర్తిస్తుంది. అపుడు ద‌క్షిణాదికి ఇది ప్ర‌మాదం. 80 శాతం లోక్‌ స‌భ సీట్లు ఉత్తరాదికి పోతాయి. ఎందుకంటే జ‌నాభా నియంత్ర‌ణ క‌ఠిన అమ‌లు వ‌ల్ల ద‌క్షిణాదిన జనాభా బాగా త‌గ్గింది. ఉత్తరాదిన మాత్రం అలాగే పెరుగుతూ ఉంది. అదే జ‌రిగితే కేంద్రం మ‌న‌కు అన్యాయం చేసినా ఏమీ ఉప‌యోగం ఉండ‌దు. ఎందుకంటే మ‌న సీట్ల‌తో అవ‌స‌రం లేకుండా ఉత్త‌రాది వారు ప్ర‌ధాని కావ‌చ్చు. మ‌న నిర‌స‌న‌ల‌కు - విన‌తుల‌కు విలువుండ‌దు. నిన్న అమ‌రావ‌తిలో జ‌రిగిన ఆర్థిక మంత్రుల స‌ద‌స్సు కూడా దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. మోడీ గెలిస్తే క‌చ్చితంగా అత‌ను మొండిగా వ్య‌వ‌హ‌రించి దీనిని అమ‌లు చేస్తాడు. ఇప్ప‌టికే ఏపీ-తెలంగాణ విష‌యంలో అత‌ను ఎంత మొండిగా వ్య‌వ‌హ‌రించాడో మ‌నం చూశాం.

1952 మొదటి లోక్‌ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 489. అయితే 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. దీనికి ప్రాతిప‌దిక‌ 1971 జనాభా. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన 2001 వరకు చేయ‌కూడ‌ద‌ని, ఆ త‌ర్వాత దీన్ని 84 రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా 2026 వరకు పొడిగించారు. రాజ్యాంగ ప్రకరణ 329 ప్ర‌కారం పునర్విభజన కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు. కాబ‌ట్టి కేంద్రం ఏద‌నుకుంటే అది చేయ‌గ‌ల‌దు. కాబ‌ట్టి పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇంకోసారి మోడీ గెలిస్తే… ద‌క్షిణాది కొంప‌మున‌గ‌డం ఖాయం.