Begin typing your search above and press return to search.

పవన్‌కు నష్టం.. తిరుపతిలో చంద్రబాబు లాభం?

By:  Tupaki Desk   |   23 Dec 2020 7:22 AM GMT
పవన్‌కు నష్టం.. తిరుపతిలో చంద్రబాబు లాభం?
X
తిరుపతి ఉప ఎన్నిక మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన మధ్య చిచ్చుపెడుతోంది. జీహెచ్ఎంసీలో బీజేపీతో కాంప్రమైజ్ అయిన జనసేనాని పవన్.. తనకు తిరుపతి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతుండడంతో ఈ పీటముడి నెలకొంది. ప్రస్తుతం బిజెపి-పవన్ కళ్యాణ్ కూటమిలో పరిస్థితులు బాగా లేదు. ఎక్కడో తేడా కొడుతోంది. దాదాపు తిరిగి రాని స్థితికి రాజకీయాలు చేరుకున్నాయి.

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవటానికి అటు బీజేపీ కానీ.. ఇటు జనసేన పార్టీ కానీ సిద్ధంగా లేదు. ఇది ప్రతిష్టాత్మక ఉప ఎన్నికగా రెండు పార్టీలకు మారింది. ఎందుకంటే కేవలం రెండు సంవత్సరాలలో లేదా అంతకన్నా తక్కువ వ్యవధిలో దేశంలో జమిలి ఎన్నికలు జరగాల్సి ఉంది.. దీంతో పవన్ బీజేపీతో స్నేహం చేస్తాడా? కాలదన్నుతాడా? అన్నది ఆసక్తి రేపుతోంది.

సయోధ్యకు అవకాశం లేకుండా జనసేన, బీజేపీల మధ్య అంతరం పెరిగిపోతే ఏపీ రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇది ఏపిలో కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణలకు అవకాశం ఇస్తుందని పుకార్లు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇప్పటికే ఇదే చాన్స్ కోసం చంద్రబాబు కాచుకు కూర్చుకున్నారు. బీజేపీతో లేదా బిజెపి-జనసేన కూటమితో ఎలాంటి సర్దుబాటు కోసమైనా చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉన్నారు. గతంలో తమ కూటమిలో భాగంగా టిడిపి తిరుపతి లోక్‌సభ సీటు టికెట్‌ను బిజెపికి టీడీపీ ఇచ్చేసింది. ఫలితంగా, 1999లో బిజెపి తిరుపతి లోక్ సభ సీటును గెలుచుకుంది.

ఆ సమయంలో, కాంగ్రెస్ పార్టీ 47.31 శాతం ఓట్లు సాధించగా.. బిజెపి 48.89 శాతం ఓట్లు సాధించి గెలిచింది.. అయితే అప్పుడు టీడీపీ బలంతో ఈ స్థాయి విజయం బీజేపీకి లభించింది. ఇప్పుడు అంత కష్టమే.. ప్రస్తుత తిరుపతి ఉప ఎన్నికలో చివరి నిమిషంలో ఆశ్చర్యకరమైన పరిణామాలను చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.. జనసేన విడివిడిగా పోటీ చేస్తే, టిడిపి ఒకవేళ బిజెపికి ఈ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది మోడీ-షా మరియు చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న పాత వైరాలను మరిచి మళ్లీ దగ్గర కావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ చరిత్ర సమాప్తం అవుతుంది. కాబట్టే తిరుపతి ఉప ఎన్నిక ఒక ఉత్తేజకరమైన ఎన్నికల యుద్ధంగా ఏపీలో కనిపిస్తోంది. బీజేపీ, జనసేన పొత్తుపైనే అందరి దృష్టి నెలకొంది.