Begin typing your search above and press return to search.

ఏపీలో ఖాళీ స్థలాలకు పన్ను.. కట్టకపోతే అది ఇక ప్రభుత్వ స్థలమే!

By:  Tupaki Desk   |   21 Dec 2022 9:30 AM GMT
ఏపీలో ఖాళీ స్థలాలకు పన్ను.. కట్టకపోతే అది ఇక ప్రభుత్వ స్థలమే!
X
ఆంధ్రప్రదేశ్‌ లో ఖాళీగా ఉన్న వ్యక్తుల స్థలాల విషయంలో అధికారులు ఈసారి గట్టిగా దృష్టి సారించారు. పట్టణాలు, నగరాల్లో ప్రజలకు ఉన్న విలువైన ఖాళీ స్థలాలకు సంబంధించి నిర్దేశించిన పన్ను కట్టాలని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖాళీ స్థలాలకు నిర్దేశించిన పన్ను చెల్లించాలని లేకపోతే దాన్ని ప్రభుత్వ స్థలంగా భావిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఖాళీ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

పట్టణాలు, నగరాల్లో తమకు ఉన్న విలువైన స్థలాలకు ఖాళీ స్థలాల పన్ను (వీఎల్‌టీ) చెల్లించకపోతే.. అలాంటి స్థలాల్లో సచివాలయాలు, సామాజిక భవనాలు నిర్మిస్తామని పట్టణ స్థానిక సంస్థల అధికారులు హెచ్చరిస్తున్నారని ప్రధాన మీడియా కథనాలు ప్రచురించింది. గతంలోనూ ఈ పన్ను ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు ఈ పన్నును పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ప్రధాన మీడియా పేర్కొంది.

రాజమహేంద్రవరం నగరం, అమలాపురం పట్టణ పరిధిలోని పలు ఖాళీ స్థలాల్లో అధికారులు ఇలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం గమనార్హం. వీటి కోవలోనే మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారని పేర్కొంటున్నారు.

వాస్తవానికి ఖాళీస్థలాలపై పన్నుల వసూలు ఎప్పటినుంచో ఉన్నా, చాలామంది కట్టడం లేదు. ఈ పన్ను స్థలం మార్కెట్‌ విలువపై నగరాల్లో 0.5%, పట్టణాల్లో 0.2% చొప్పున ఉంది. పన్ను కట్టనివారికి అధికారులు గతంలో ఫోన్లు చేసి చెప్పేవారు. స్పందించకపోతే నోటీసులు ఇచ్చేవారు. అయినా బకాయిలు చెల్లించకపోతే హెచ్చరిక బోర్డులు పెట్టేవారు. నోటీసు రాగానే కొందరు బకాయిలు చెల్లిస్తారు. అయితే ఈసారి మాత్రం పన్ను చెల్లించకపోతే ఆ స్థలాలను ప్రభుత్వ స్థలాలుగా భావిస్తామని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

ఒక రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోనే ఏకంగా 300 ఖాళీస్థలాల్లో బోర్డులు పెట్టారని తెలుస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడపతో పాటు కొన్ని పట్టణాల్లోనూ ఇలాగే బోర్డులు పెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

ఇందులో భాగంగా రాబోయే మూడు నెలల్లో (జనవరి–మార్చి) 123 పుర, నగరపాలక సంస్థల్లో ఖాళీస్థలాల నుంచి రూ.609.20 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.