Begin typing your search above and press return to search.

హైకోర్టు ఆదేశాలు అమలైతే సూపరనే చెప్పాలి

By:  Tupaki Desk   |   3 Jun 2021 3:30 PM
హైకోర్టు ఆదేశాలు అమలైతే సూపరనే చెప్పాలి
X
'కరోనా వైరస్ వైద్యం పేరుతో రోగులనుండి లక్షల్లో వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించాలి'..ఇది తాజాగా తెలంగాణా హైకోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు. కరోనా వైరస్ రోగుల నుండి లక్షల్లో వసూలు చేస్తున్న ఆసుపత్రులపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జీ మాట్లాడుతు రోగుల కుటుంబసభ్యుల నుండి అధికంగా ఆసుపత్రుల యాజమాన్యాలు వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించటమే కాకుండా వాటి లైసెన్సులను కూడా రద్దు చేయాలని ఆదేశించింది.

అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల విషయమై ప్రభుత్వం నిరంతరంగా అబ్జర్వేషన్లో ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. అధిక ఫీజలు వసూలు చేశారనే ఆరోపణలపై ఇప్పటివరకు 174 ఆసుపత్రులపై ఫిర్యాదులు అందినట్లు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత 21 ఆసుపత్రులకు కోవిడ్ ఆసుపత్రులకు లైసెన్సులను రద్దు చేసినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని కోవిడ్ వైద్యం లైసెన్సును రద్దు చేయటం మాత్రమే కాదని ఏకంగా ఆసుపత్రి లైసెన్సును కూడా రద్దు చేస్తామంటేనే బాధితులకు ఆసుపత్రుల యాజమాన్యాలు అధికంగా వసూలు చేసిన డబ్బును తిరిగిస్తాయని కోర్టు అభిప్రాయపడింది. మొదటిదశ కరోనా వైరస్ సమయంలో కూడా అధిక ఫీజుల ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులపై దర్యాప్తు చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. అప్పట్లో రు. 3 కోట్ల రూపాయలను ఆసుపత్రుల నుండి బాధిత కుటుంబాలకు తిరిగి ఇప్పించినట్లు కూడా వివరించారు.

సో అధిక ఫీజుల వసూలును తిరిగి ఇప్పించటం, ఏకంగా ఆసుపత్రుల లైసెన్సుల రద్దు అన్న ఆదేశాలు గనుక అమల్లోకి వస్తే సంచలనం మొదలైనట్లే అనుకోవాలి. అసలు మందే లేని కరోనా వైరస్ రోగానికి కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో బాధిత కుటుంబాలు ఎంత గోల చేస్తున్నా పట్టించుకునే నాదుడే కనబడటంలేదు. ఈ దశలోనే హైకోర్టు జోక్యం చేసుకోవటం బాధిత కుటుంబాలకు ఊరట కలిగించటమనే చెప్పాలి.