Begin typing your search above and press return to search.

భర్త కరోనాతో చనిపోతే భార్యకి రూ.2.5 లక్షలు.. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం

By:  Tupaki Desk   |   28 Jun 2021 3:30 PM GMT
భర్త కరోనాతో చనిపోతే భార్యకి రూ.2.5 లక్షలు.. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం
X
కరోనా కారణంగా ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తులని కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి కుటుంబాలను ఆదుకోడానికి అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో భర్తను కోల్పోయిన మహిళలకు రూ.2.5 లక్షల ఆర్ధిక సాయం అందజేయనున్నట్టు ఆదివారం ప్రకటించింది. 'ముఖ్యమంత్రి కోవిడ్-19 వితంతు సహాయ పథకం' కింద ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు సీఎం హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. అయితే, రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికే ఇది వర్తిస్తుందని ఒక షరతు విధించారు. ఈ పథకం కింద రూ.2.5 లక్షల ఆర్ధిక సాయంతోపాటు యథావిధిగా వితంతు పెన్షన్లు అందజేయనున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోతున్నాం.. అనేక కుటుంబాల్లో దుఃఖాన్ని మిగిల్చుతోంది.. మహమ్మారి కారణంగా భర్తలను కోల్పోయిన మహిళలకు కొంత ఉపశమనం కలిగించే మా హృదయపూర్వక ప్రయత్నంలో భాగంగా అర్హత కలిగిన వితంతువులకు రూ .2.5 లక్షలు ఒకేసారి అందజేయనున్నాం అని ట్విట్టర్‌లో సీఎం వెల్లడించారు.

లబ్దిదారుల భర్త కోవిడ్ వల్ల చనిపోయినట్టు రాష్ట్రస్థాయి కోవిడ్ మరణాలు ఆడిట్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుంది... అలాగే, కుటుంబం వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి'అని సీఎం తెలిపారు. అయితే, కోవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి భార్యలకు ఈ పథకం వర్తించదని, ఎప్పటి మాదిరిగానే వీరికి కుటుంబ ఫించన్ అందుతుందని వివరించారు. ప్రభుత్వం వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం.. కరోనా బాధితుల జాతీయ ఆరోగ్య మిషన్ డేటా బేస్ నుంచి అర్హులైన వారి జాబితా డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో రూపొందించనున్నారు..దీనిని అర్హత ప్రమాణాల ఆధారంగా పరిశీలించిన అనంతరం ఎంపికచేసిన లబ్దిదారుల ఖాతాలకు నేరుగా జమచేస్తారు. అర్హులైనా జాబితాలో పేరు లేనివారు సంబంధిత పత్రాలను డిప్యూటీ కమిషనర్‌కు సమర్పించవచ్చు ఈ పథకాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలని పలువురు కోరుతున్నారు....