Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీకి అంత ఉంటే.. వాళ్ళు అలా నోరు పారేసుకుంటారా రోజా?

By:  Tupaki Desk   |   18 Jan 2023 4:39 AM GMT
మెగా ఫ్యామిలీకి అంత ఉంటే.. వాళ్ళు అలా నోరు పారేసుకుంటారా రోజా?
X
నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. వెనుకా ముందు చూసుకోకుండా వ్యాఖ్యలు చేయటంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు ముందుంటారు. అప్పటికి అయిపోయిందా? లేదా? అన్నదే తప్పించి.. మిగిలిన సంగతుల్ని పట్టించుకోని తీరు కనిపిస్తూ ఉంటుంది. ఆ కోవలోకి వచ్చే నేతల్లో ముందు వరసలో ఉంటారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీపై నోరు పారేసుకున్నారు రోజా. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పే క్రమంలో మెగా ఫ్యామిలీపై తనకున్న అక్కసును ఆమె వెళ్లబోసుకున్నారు.

మెగా ఫ్యామిలీలో ఆరేడుగురు హీరోలు ఉన్నారని.. వారు ఇండస్ట్రీని భయపెడుతుంటారని పేర్కొన్నారు. ఇటీవల రణస్థలిలో బహిరంగ సభలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటం తెలిసిందే. అయితే.. ఇవన్నీ కూడా పవన్ స్వయంగా ఆది చేత చెప్పించారన్నట్లుగా రోజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. వాళ్లు ఎంత? వాళ్ల ప్రాణం ఎంత? వాళ్ల మాటలు వెనుక ఎవరున్నారో తెలీదా? అంటూ రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీని మెగా ఫ్యామిలీ రూల్ చేస్తుందని.. వారి కుటుంబంలో పెద్ద ఎత్తున హీరోలు ఉండటంతో ఇండస్ట్రీని తమ చెప్పు చేతుల్లో ఉంచుకున్నట్లుగా రోజా మాట్లాడారు. మెగా ఫ్యామిలీ మీద ప్రేమ లేదని.. భయం మాత్రమే ఉందంటూ కొత్త సూత్రీకరణ చేశారు. ఒకవేళ రోజా చెప్పినట్లుగా మెగా ఫ్యామిలీ మీద భయమే ఉండి ఉంటే.. అలీ లాంటి హాస్య నటుడు ఇంతలా మాట్లాడతారా? అన్నది ప్రశ్న. అంతే కాదు.. ఆ మధ్యలో పోసాని క్రిష్ణ మురళీ కావొచ్చు.. థర్టీ ఇయర్స్ ప్రథ్వీ కావొచ్చు.. మరికొందరు కావొచ్చు.. నోరు విప్పే సాహసం చేస్తారా? అన్నది ప్రశ్న.

చిన్న చిన్న వేషాలు వేసుకునే అలీ.. ఈ రోజున జగన్ ఆదేశిస్తే తనకు సన్నిహిత స్నేహితుడైన పవన్ కల్యాణ్ పై పోటీ చేసేందుకు సైతం సిద్ధమన్న మాటలు మాట్లాడతారా? మెగా కుటుంబాన్ని ఎన్ని అన్నా.. సహనంతో ఉండటంతో పాటు..ఎవరినైనా క్షమించే లక్షణమే వారికిప్పుడు పెద్ద మైనస్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.

నిజంగానే.. భయపెట్టే ఆయుధమే మెగా ఫ్యామిలీకి ఉండి ఉంటే.. అలీకి ఈ రోజుకు అవకాశాలు రావటం దేనికి నిదర్శనం? రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టంగా చెప్పేసిన తర్వాత కూడా పవన్ మీద ఉన్న కోపంతో.. ఆయన సోదరుడు చిరంజీవిని మొదలుకొని మెగా ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేయటం కనిపిస్తుంది. నిజంగానే అంత భయపెట్టే లక్షణమే మెగా ఫ్యామిలీకి ఉండి ఉంటే.. విపక్షంలో రోజా ఉన్నప్పుడు సంగతి చూసేవారు కదా? మరి.. అలా ఎందుకు జరగనట్లు? అన్నది అసలు ప్రశ్న.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.