Begin typing your search above and press return to search.

పోలీసులు అక్ర‌మంగా నిర్బంధిస్తే.. ఇదే జ‌రుగుతుందిః కోర్టు సంచ‌ల‌న తీర్పు

By:  Tupaki Desk   |   14 Jun 2021 10:30 AM GMT
పోలీసులు అక్ర‌మంగా నిర్బంధిస్తే.. ఇదే జ‌రుగుతుందిః  కోర్టు సంచ‌ల‌న తీర్పు
X
ఈ మ‌ధ్య వ‌చ్చిన ‘నాంది’ సినిమాలో అమాయ‌కుల‌పై అక్రమ కేసులు బనాయించే పోలీసులపై.. సెక్షన్ 211 ఎలా ప్ర‌యోగించ‌వ‌చ్చో క్లియ‌ర్ గా చూపించారు. స‌రిగ్గా ఇదేవిధ‌మైన తీర్పును వెలువ‌రించింది అల‌హాబాద్ హైకోర్టు. పౌరుల‌ను అక్ర‌మంగా నిర్బంధించి వేధిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించిన న్యాయ‌స్థానం.. బాధితుల‌ను వేధించినందుకు గానూ న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశాలు జారీచేసింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో పోలీసులు ఇద్ద‌రు యువ‌కుల‌ను నిర్బంధించారు. వ్య‌క్తిగ‌త పూచీక‌త్తు ఇస్తామ‌ని చెప్పినా, వారు ఇత‌ర ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించినా.. విడుద‌ల చేయ‌లేదు. దీంతో.. బాధితులు కోర్టును ఆశ్ర‌యించారు. కేసు విచారించిన న్యాయ‌స్థానం.. అధికారుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.

అక్ర‌మంగా నిర్బంధించి, వేధించినందుకుగానూ బాధితుల‌కు రూ.25 వేల ప‌రిహారం అందించాల‌ని ఆదేశించింది. చ‌ట్టం అప్ప‌గించిన విధుల‌ను నిర్వ‌ర్తించ‌డంలో విఫ‌ల‌మైన అధికారుల నుంచి ప‌రిహారం పొంద‌డానికి బాధితుల‌కు అర్హ‌త ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మొత్తాన్ని వెంట‌నే ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి చెల్లించాల‌న్న న్యాయ‌స్థానం.. ఆ త‌ర్వాత క్ష‌మించ‌రాని ప్ర‌వ‌ర్త‌న‌కు కార‌ణ‌మైన అధికారుల‌ నుంచి తిరిగిపొందాల‌ని ఆదేశించింది.

అధికారం చేతిలో ఉందిక‌దా అని సామాన్యుల‌పై ప్ర‌భుత్వాలు, వ్య‌వ‌స్థ‌లు అణ‌చివేత‌కు పాల్ప‌డితే.. తిరుగుబాట్లు వ‌స్తాయ‌ని కోర్టు హెచ్చ‌రించింది. అక్ర‌మంగా నిర్బంధించడం వ్య‌క్తిగ‌తంగా బాధితుల‌కు హాని క‌లిగించ‌డ‌మే కాకుండా.. ఆ గాయం స‌మాజానికి కూడా చేటు చేస్తుంది అని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది.