Begin typing your search above and press return to search.

అదే జరిగితే.. మోడీకి అంతకంటే అవమానం ఉండదు

By:  Tupaki Desk   |   21 Jun 2021 3:30 AM GMT
అదే జరిగితే.. మోడీకి అంతకంటే అవమానం ఉండదు
X
సోషల్ మీడియాపై కత్తిదూసిన ప్రధాని మోడీకి ఇప్పుడు అంతర్జాతీయంగా ఇబ్బందులు తప్పవా? ఐక్యరాజ్యసమితి దేశంలో మానవహక్కులు, సోషల్ మీడియా స్వేచ్ఛపై గుర్రుగా ఉందా? ఈ మేరకు ప్రధాని మోడీని, భారత ప్రభుత్వాన్ని దేశంలోని పరిణామాలపై వివరణ కోరిందా? అంటే ఔననే అంటున్నాయి అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి వర్గాలు..

దేన్నైతే ఆయుధంగా చేసుకొని 2014 లో ‘చాయ్ వాలా ప్రధాని కాకూడదా?’ అని నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అయ్యాడో ఇప్పుడు అదే సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలు, వైఫల్యాలపై కామెంట్లను తట్టుకోలేకపోతున్నారన్న విమర్శ ఉంది. సోషల్ మీడియాపై కత్తి కట్టి కొత్త ఐటీనిబంధనలు పెట్టి ‘సోషల్ మీడియా’ను కేంద్రం అణగదొక్కుతోందన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి.

దేశంలో సోషల్ మీడియా వేదికలుగా ఉన్న ట్విట్టర్, ఫేస్ బుక్, సహా అనేక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. రెచ్చగొట్టడం.. సమాజంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారనే కారణంగానే కేంద్రప్రభుత్వం ఇటీవల కొత్త ఐటీ నిబంధనలు తీసుకొచ్చింది. ఆ వెంటనే ట్విట్టర్ పై కేంద్రం చర్యలు తీసుకుంది. ట్విట్టర్ కూడా వెనక్కుతగ్గకుండానే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.

కాగా తాజాగా ఈ విషయం ఐక్యరాజ్యసమితి వరకు వెళ్లిందట.. ఈ క్రమంలోనే దేశంలో ఐటీ నిబంధనలు అంటూ సోషల్ మీడియాను కట్టడి చేయడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిందట.. ‘భారత్ లో అసలు ఏం జరుగుతుందో చెప్పాలి’ అంటూ మోడీ ప్రభుత్వాన్ని నిలదీసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి వివరణ ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.

దేశంలో సోషల్ మీడియా వేదికలు దుర్వినియోగం అవుతున్నాయని.. పలు ఉదాహరణలు చూపెట్టి కొత్త ఐటీ నిబంధనలు తేవాల్సి వచ్చిందని తాజాగా మోడీ సర్కార్ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలికి తెలిపిందట.. ఉగ్రవాదం, అశ్లీలత, ఆర్థిక అవకతవకలు, హింసను రెచ్చగొట్టడం వంటి నేరాలకు సోషల్ మీడియా దోహదపడిందని ఐక్యరాజ్యసమితిలోని భారత పర్మనెంట్ మిషన్ కు లేఖ రాసింది. గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్తను ఏర్పాటు చేసి సోషల్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ఐటీ నిబంధనలు తెచ్చామని చెప్పారు.

ఇక సుప్రీం కోర్టు కూడ సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆదేశాలు ఇచ్చిందని.. అవసరమైన వ్యవస్థలను నెలకొల్పాలని కోరిందని.. అందుకే ఇలా చేశామని మోడీ సర్కార్ ఐక్యరాజ్యసమితికి వివరణ ఇచ్చింది.

ఇప్పటికే పాకిస్తాన్ లోనూ ఇలానే జరిగితే ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించి అంతర్జాతీయ మానవ హక్కుల బృందాన్ని పంపింది.. ఒక వేళ భారత్ పై కూడా ఐఎన్ఓ సీరియస్ అయితే ఆ బృందాన్ని పంపే అవకాశం ఉంది. అదే జరిగితే మోడీ సర్కార్ కు అంతకంటే అవమానం మరొకటి ఉండదంటున్నారు.