Begin typing your search above and press return to search.

అదే జ‌రిగితే.. ఏపీకి అప్పు పుట్ట‌దు!

By:  Tupaki Desk   |   17 Nov 2021 3:30 PM GMT
అదే జ‌రిగితే.. ఏపీకి అప్పు పుట్ట‌దు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోంది. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల కోసం ప్ర‌భుత్వం భారీగానే ఖర్చుచేస్తుండ‌డం.. అందుకు త‌గిన‌ట్లుగా ఆదాయం స‌మ‌కూర‌క‌పోవ‌డంతో ఏపీ అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేదు. నెల నెల ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వాల‌న్నా.. పెన్ష‌న‌ర్ల‌కు డ‌బ్బులు చెల్లించాల‌న్నా అప్పు చేయాల్సిన ప‌రిస్థితి రాష్ట్రానిది. అయితే ఇప్పుడు ఆ అప్పు పుట్టే అవ‌కాశం ప్ర‌మాదంలో ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌డువు దాటినా పాత బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డం.. అప్పు ఇచ్చిన కేంద్ర సంస్థ‌ల ప‌ట్ల మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌మాదంలో నెట్టేయ‌నుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లైన గ్రామీణ విద్యుదీక‌ర‌ణ సంస్థ (ఆర్ఈసీ), ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ (పీఎఫ్‌సీ)ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.4 వేల కోట్లు బ‌కాయి ప‌డింది. ఇప్ప‌టికే రుణం తిరిగి చెల్లించాల్సిన గ‌డువు దాటి మూడు నెల‌లు అవుతున్నా ఎప్పుడు క‌డుతుందో ప్ర‌భుత్వం చెప్ప‌డం లేదు. ఆ సంస్థ‌లు లేఖ‌లు రాసినా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేదు. రూ.4 వేల కోట్లు బ‌కాయిలు చెల్లించేందుకు గ‌డువు ముగిసింద‌ని వంద శాతం రాష్ట్ర ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యం ఉన్న జెన్‌కో, ప‌వ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ల‌ను డిఫాల్ట‌ర్లుగా ప్ర‌క‌టించాల‌నుకుంటున్నామ‌ని స్పందించాల‌ని లేఖ రాసి 15 రోజులు దాటింది. దీంతో నేరుగా ప్ర‌భుత్వ అధికారుల‌తో మాట్లాడేందుకు ఆ సంస్థ‌ల సీఎండీలు రాష్ట్రానికి వ‌చ్చినా స‌రిగా ఆహ్వానించ‌లేద‌ని స‌మాచారం. 10 రోజులుగా అడుగుతుంటే బుధ‌వారం ప్ర‌భుత్వ అధికారుల‌ను క‌లిసేందుకు వాళ్ల‌కు అనుమ‌తి ఇచ్చార‌ని తెలిసింది.

జెన్‌కో, ప‌వ‌ర్ డెవ‌లప్‌మెంట్ కార్పొరేష‌న్ల‌ను డిఫాల్ట‌ర్లుగా ప్ర‌క‌టించే ముందు ఆర్ఈసీ, పీఎఫ్‌సీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇస్తున్న చివ‌రి అవ‌కాశ‌మిది. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం మొత్తం బ‌కాయిల్లో కొంచెం ఇప్పుడు క‌ట్టి మ‌రింత గ‌డువు అడుగుతుందా? లేదా మొత్తం చెల్లించేందుకు మ‌రింత స‌మ‌యం ఇవ్వ‌మ‌ట్టుందా? అన్న‌ది చూడాలి. ఒక‌వేళ ప్ర‌భుత్వం ఈ సంస్థ‌ల సీఎండీల‌కు ఏ మాత్రం స‌హ‌క‌రించ‌క‌పోయినా అప్పుడ‌వి జెన‌కో, ప‌వ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ల‌ను డిఫాల్ట‌ర్లుగా ప్ర‌క‌టిస్తాయి. దీంతో ఇక ఆ సంస్థ‌ల‌కు అప్పు పుట్ట‌దు. అందులో రాష్ట్ర ప్ర‌భుత్వానిదే వంద శాతం వాటా కాబ‌ట్టి ప్ర‌భుత్వానికి కూడా అప్పు పుట్టే అవ‌కాశం ఉండదు. అప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ‌డం ఇదే తొలిసారిన బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఆర్ఈసీ, పీఎఫ్‌సీ పూర్తిగా ఆర్‌బీఐ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ప్ర‌తి నెలా ఇవి త‌మ అప్పులు, వ‌సూళ్ల‌ను దానికి వెల్ల‌డించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే అప్పు చెల్లింపు గ‌డువు దాటిపోయి 90 రోజుల అయిపోయింది కాబ‌ట్టి జెన్‌కో, ప‌వ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ల‌ను డిఫాల్ట‌ర్లుగా ప్ర‌క‌టిస్తూ ఆర్‌బీఐకి అవి స‌మాచారం పంపాలి. లేదంటే ఏం చ‌ర్య‌లు తీసుకున్నార‌న్న‌ది చెప్పాలి. లేక‌పోతే ఆ సంస్థ‌ల నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ లైసెన్స్‌ల‌ను ఆర్‌బీఐ ర‌ద్దు చేస్తుంది. అందుకే ఆర్ఈసీ, పీఎఫ్‌సీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల కోసం వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఆ బకాయిల్లో కొంత చెల్లిద్దామ‌న్న రాష్ట్ర ఖ‌జ‌నాలో డ‌బ్బు లేదు. వ‌చ్చిన ఆదాయ‌మంతా ఆర్‌బీఐ ఓడీ అప్పు కింద జ‌మ చేసుకుంటుంది. రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద ప్ర‌తి నెలా ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన రూ.1,450 కోట్లు ఇంకా రాలేదు. దీంతో బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ కింద రూ.25 వేల కోట్లు అప్పు తేవాల‌ని ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎండీల బృందానికి ప్ర‌భుత్వం ఏం చెప్తుందో చూడాలి. మ‌రోవైపు వాళ్ల హోదాకు త‌గిన‌ట్లు కాకుండా స్వాగ‌తం ప‌లికేందుకు ప్ర‌భుత్వం ఓ ఇంజ‌నీర్‌ను పంపించ‌డం అవ‌మాన‌కరంగా ఉంద‌ని వాళ్లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.