Begin typing your search above and press return to search.

డేటా లేదంటే.. అది ఎన్డీఏ.. కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ పేరు

By:  Tupaki Desk   |   23 July 2022 11:31 AM GMT
డేటా లేదంటే.. అది ఎన్డీఏ.. కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ పేరు
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా పరిణతితో వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మరింత నిశితంగా కేంద్ర ప్రభుత్వాన్ని దునుమాడుతూ ఆకట్టుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. మరికొన్ని పార్టీలతో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)గా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అయితే.. ఎన్డీఏ, ప్రధాని మోదీకి భిన్నభిన్న పేర్లను పెట్టి ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు.

జీఎస్టీ కాదు.. గబ్బర్ సింగ్ ట్యాక్స్.. బాలీవుడ్ ఆల్ టైమ్ హిట్ షోలే. అందులో మరింత పాపులర్ గబ్బర్ సింగ్ పాత్ర. అమ్జాద్ ఖాన్ ఆ దుష్ట పాత్రకు అంతగా పేరు తెచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)కి గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా రాహుల్ గాంధీ పేరు పెట్టారు. ఇటీవల పలు నిత్యవసర పదార్థాలపై కేంద్రం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ.. రాహుల్.. గబ్బర్ సింగ్ స్ట్రయిక్స్ ఎగైన్ అంటూ విరుచుకుపడ్డారు. అంతకుముందు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి జుమ్లా సర్కార్ గా పేరు పెట్టారు. ఆ పేరు కూడా పాపులర్ అయింది.

ఇక తెలుగులోనూ పవర్ స్టార్ పవన్ కల్యాన్ గబ్బర్ సింగ్ పేరిట సినిమా తీశారు. బాలీవుడ్ దబాంగ్ కు రీమేక్ (ఫ్రీ మేక్ అనొచ్చు)గా 2011లో వచ్చిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్. ఖుషీ తర్వాత పవన్ కు హిట్ సినిమాలు లేనప్పుడు గబ్బర్ సింగ్ ఆ లోటు తీర్చింది. అంటే.. గబ్బర్ సింగ్ పేరు ఈ తరం తెలుగువారికీ సుపరిచితమే.

డేటా లేదంటే.. అది ఎన్డీఏ కాగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ సమాచారం అడిగినా తమ వద్ద డేటా లేదంటూ బుకాయించేది. కొవిడ్ రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎందరు చనిపోయారు? వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఎందరు మరణించారు? వంటి ప్రశ్నలకు కేంద్రం తమ వద్ద డేటా లేదనే చెప్పింది. అంతకుముందుకు కొవిడ్‌ మొదటి వేవ్ సందర్భంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంలో నడకదారిన వెళ్లిన చాలా మంది వలస కూలీలు మరణించారు. దీనిపై కేంద్రం అప్పట్లో తమ వద్ద అలాంటి డేటా ఏదీ లేదని పేర్కొంది.

ఇలా పలు సందర్భాల్లో కేంద్రం తమ వద్ద డేటా లేదని సమాధానం ఇవ్వడంపై రాహుల్‌ ఈ విధంగా స్పందించారు. దీంతో వివిధ సందర్భాల్లో తమ వద్ద తగిన డేటా లేదంటూ కేంద్రం సమాధానం ఇవ్వడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సెటైర్‌ వేశారు. ఈ ప్రభుత్వం వద్ద డేటానే కాదు..

జవాబుదారీతనం కూడా లేదని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎన్డీయే అనే పదానికి తనదైన నిర్వచనం ఇచ్చారు. ఎన్డీయే అంటే నో డేటా అవలైబుల్‌ (NDA- No data Available) అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు.ఆక్సిజన్‌ కొరత కారణంగా చనిపోవడం గానీ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఎవరూ చనిపోవడం గానీ జరగలేదన్న విషయం ప్రజలు నమ్మాలని ఈ ప్రభుత్వం(No data availble-NDA) కోరుకుంటోందని రాహుల్‌ గాంధీ అన్నారు. మూకదాడులు, జర్నలిస్టుల అరెస్టుల వంటి వాటిపైనా ప్రభుత్వం మౌనంగా ఉండడాన్నితప్పుబట్టారు. ఈ ప్రభుత్వం వద్ద డేటా లేదు.. సమాధానం లేదు.. జవాబుదారీతనం అసలే లేదని ట్వీట్‌ చేశారు.