Begin typing your search above and press return to search.

మాస్క్ లేకుండా లోపలికి రానిస్తే రూ. 25 వేల ఫైన్ !

By:  Tupaki Desk   |   15 July 2021 4:12 AM GMT
మాస్క్ లేకుండా లోపలికి రానిస్తే రూ. 25 వేల ఫైన్ !
X
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ జోరు ఇంకా పూర్తిగా తగ్గలేదు. అయితే, సెకండ్ వేవ్ పీక్స్ లో ఉన్న సమయంలో రోజుకి నాలుగు లక్షలకి పైగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కానీ, ప్రస్తుతం ఆ పాజిటివ్ కేసుల సంఖ్య ముప్పై వేలకి చేరుకుంది. దీనితో దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూను కూడా పూర్తిగా ఎత్తేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో సడలింపులతో కూడిన కర్ఫ్యూ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే లాక్ డౌన్ లేదు కాబట్టి కరోనా తగ్గినట్టే అని చాలామంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు అమలు చేస్తున్న కర్ఫ్యూపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సడలింపులతో కర్ఫ్యూను ఈనెల 21 వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రకటింస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించింది. కరోనా కట్టడి కోసం అమల్లోకి తీసుకువచ్చిన కర్ఫ్యూ సడలింపులు ఇచ్చినప్పటికీ పేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన విధించింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.

జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తామన్నారు. అలాగే 2-3 రోజులపాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్‌ నెంబరును ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజూ రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని సింఘాల్ వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. మరోవైపు మాస్కులు ధరించని వారి నుంచి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్‌ ఐలు సహా ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం అమలు చేసిన కర్ఫ్యూ నిబంధనలతో పాజిటివిటీ రేటు దిగివచ్చింది. ఐతే ఇంకా కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజుల వ్యవధిలో వైరస్ వేగంగా వ్యాప్తిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక టాస్క్ ఫోర్స్ కమిటీలు కర్ఫ్యూ నిబంధనలను మరింత కఠినం చేస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో ఒక్కరోజులో 33 మందికి పాజిటివ్ గా తేలడంతో అధికారులు లాక్ డౌన్ విధించారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత అన్ని రకాల కార్యకలాపాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మాచవరం మండల కేంద్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించిట్లు తహసీల్దార్ పుల్లారావు తెలిపారు. నిత్యావసరాల కోసం 12గంటల వరకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సడలింపులు ఇచ్చిన సమయంలో బయటకు వచ్చేవారు కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,591 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 15 మంది మృతి చెందారు. తాజాగా 3,329 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,87,670 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,057 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,32,20,912 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 69, చిత్తూరు జిల్లాలో 349, తూర్పుగోదావరి జిల్లాలో 511, గుంటూరు జిల్లాలో 219, కడప జిల్లాలో 217, కృష్ణాజిల్లాలో 190, కర్నూలు జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 162, ప్రకాశం జిల్లాలో 251, శ్రీకాకుళం జిల్లాలో 62, విశాఖపట్నం జిల్లాలో 220, విజయనగరం జిల్లాలో 46, పశ్చిమగోదావరి జిల్లాలో 266 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.