Begin typing your search above and press return to search.

ఈ ఉదంతం తెలిస్తే.. టీఎన్ శేషన్ విలువ ఇట్టే తెలుస్తుంది

By:  Tupaki Desk   |   11 Nov 2019 6:13 AM GMT
ఈ ఉదంతం తెలిస్తే.. టీఎన్ శేషన్ విలువ ఇట్టే తెలుస్తుంది
X
అప్పటి వరకూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అంటే.. కేంద్రం చెప్పినట్లు గా వినే అధికారిగా మాత్రమే ఇమేజ్ ఉండేది. అలాంటిది తన చేతలతో మొత్తంగా మార్చేయటమే కాదు.. ఎప్పటికి తరగని ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత టీఎన్ శేషన్ సొంతంగా చెప్పాలి. ఆయన గురించి ఎందుకంత గొప్ప గా చెబుతారు? ఆయనకు మిగిలిన వారికి తేడా ఏమిటి? ఆయన్ను ఎందుకంత గా పొగుడుతారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే.. ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుంటే విషయం మొత్తం ఇట్టే అర్థమై పోతుంది.

టీఎన్ శేషన్ కేబినెట్ సెక్రటరీ గా ఉండేవారు. అప్పట్లో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. ఒక రోజు టీఎన్ శేషన్ ను పిలిపించిన రాజీవ్ గాంధీ.. కొన్ని తేదీలు చెప్పి.. ఆ వేళల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కు చెప్పండంటూ ఆదేశించారు. ఇలాంటి పరిస్థితే వేరే వారికి ఎదురైతే.. వెనుకా ముందు చూసు కోకుండా ఓకే సార్ అని చెప్పటమే కాదు.. తమ విధేయతను ప్రదర్శించేవారు.

కానీ.. అందుకు భిన్నంగా టీఎన్ శేషన్. ప్రధాని రాజీవ్ మాటలు సరి కావన్న విషయాన్ని ఆయన కే సూటిగా చెప్పటమేకాదు.. అలాంటి తీరు సరికాదని.. ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ అని.. ఎన్నికల తేదీల్ని డిసైడ్ చేయాల్సింది ఈసీనే అన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని మాత్రమే చెప్పగలమని మాత్రమే ప్రధాని రాజీవ్ కు తేల్చి చెప్పారు.

ఇంత దమ్ము.. ధైర్యం ఇప్పటి అధికారుల నుంచి ఆశించ గలమా? అధినేతల నోటి నుంచి మాట వచ్చింది మొదలు పూర్తి చేసే వరకూ నిద్ర పోని నేటి అధికారులకు.. టీఎన్ శేషన్ కు మధ్య నున్న వ్యత్యాసం ఈ ఉదంతం చెప్పేస్తుంది. అంతేకాదు.. ఎన్నికల సంస్థ భారత ప్రభుత్వంలో భాగం కాదు.. అదో స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని రాజకీయ పార్టీలకు.. ముఖ్యంగా అధికార పక్షాలకు అర్థ మయ్యేలా చేయటం లో ఆయన కీలక భూమిక పోషించారు.

పుస్తకాల్లో రాసి ఉన్న దానికి.. ఆచరణలో అమలు చేయటానికి మధ్యనున్న వ్యత్యాసం చాలానే ఉంటుంది. ఆ నిజాన్ని గుర్తించటమే కాదు.. వ్యవస్థ లోని మోనాట నిజాన్ని మొదటి కంటా తుంచేయటంలోనూ టీఎన్ శేషన్ ను సాటి వచ్చే అధికారి ఇటీవల కాలంలో లేరన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. మిగిలిన శాఖలకు ఏదైతే నోట్ లు పంపుతారో.. మంత్రులు.. అధికారపక్షం నేతలు ఎన్నిక సంఘాని కి అదే రీతిలో నోట్ లు పంపే కల్చర్ కు బ్రేకులు వేయటం లో శేషన్ కీల భూమిక పోషించారని చెప్పాలి.

ఈసీ ఒక స్వతంత్ర వ్యవస్థ అని.. దానికి ఇలా చేయండి.. అలా చేయండని నోట్ పంపటం సరికాదన్న విషయాన్ని తాను చాలా మర్యాద గా చెప్పే వాడినంటూ శేషన్ పలు సందర్భాల్లో ప్రస్తావించేవారు. కేంద్ర న్యాయశాఖామంత్రిని కలుసుకోవటం కోసం ఆయన ఆఫీసు బయట ఎన్నికల కమిషన్లు వెయిట్ చేసేవారు. కానీ.. అలాంటి వాటిని బద్ధలు కొట్టటమే కాదు.. ఎన్నికల కమిషన్ కు ఉన్న రాజ్యాంగపరమైన హోదా ఎంతన్న విషయాన్ని పాలకులకు.. రాజకీయ పార్టీల కే కాదు ప్రజలకు అర్థమయ్యేలా చేయటంలో టీఎన్ శేషన్ కీలక భూమిక పోషించారని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి.. టీఎన్ శేషన్ మాదిరి అధికారులు మీ చుట్టూ ఉన్న ప్రపంచం లో ఎంతమంది కనిపిస్తారు?