Begin typing your search above and press return to search.

మూడో వేవ్‌‌‌పై ఆ మాటలు నిజమైతే..

By:  Tupaki Desk   |   12 Jun 2021 1:30 AM GMT
మూడో వేవ్‌‌‌పై ఆ మాటలు నిజమైతే..
X
గ‌త ఏడాది క‌రోనా ఉద్ధృతి త‌గ్గుముఖం ప‌ట్ట‌గానే ఇక ముప్పుతొలగిపోయింద‌ని అంతా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. నెమ్మ‌దిగా అన్ని వ్యాపారాలూ పుంజుకున్నాయి. ష‌ర‌తుల‌న్నీ తొల‌గిపోయాయి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాల గురించి అప్ డేట్లు ఆగిపోయాయి. అస‌లు క‌రోనా చ‌ర్చ‌కే ఒక ద‌శ‌లో తెర‌ప‌డిపోయింది. ఆ స‌మ‌యంలోనే కొంద‌రు నిపుణులు సెకండ్ వేవ్ గురించి హెచ్చ‌రిస్తూ వ‌చ్చినా ఎవ‌రికీ ప‌ట్ట‌లేదు. సామాన్య ప్ర‌జ‌లు ప‌ట్టించుకోకుంటే స‌రే కానీ.. ప్రభుత్వాల‌ను న‌డిపేవాళ్లు ఆ హెచ్చ‌రిక‌ల్ని సీరియ‌స్‌గా తీసుకోవాల్సింది. కానీ అది ఎవ్వ‌రూ చేయ‌లేదు. ఫ‌లితంగా ఎంత న‌ష్టం జ‌రిగిందో గ‌త రెండు మూడు నెల‌ల్లో అంద‌రూ చూశారు. ఇక ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ గురించి హెచ్చ‌రిక‌ల‌న్నీ ప‌ట్టించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వ్యాక్సినేష‌న్ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది, వైద్య స‌దుపాయాలు మెరుగ‌య్యాయి. కాబ‌ట్టి అంత ప్ర‌మాదం ఉండ‌ద‌ని అనుకుంటున్నారు.

కానీ కొంద‌రు నిపుణులు మాత్రం ఈసారి జ‌ర‌గ‌బోయే న‌ష్టం మామూలుగా ఉండ‌ద‌ని.. థ‌ర్డ్ వేవ్ ముప్పు ఊహించ‌ని స్థాయిలో ఉంద‌ని అంటున్నారు. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయిన మ‌ల్లిక్ ప‌రుచూరి అనే కెమిక‌ల్ ఇంజినీర్ ఓ టీవీ ఛానెల్ చ‌ర్చ‌లో భాగంగా క‌రోనా మూడో ద‌శ గురించి చేసిన హెచ్చ‌రిక‌లు భ‌యం పుట్టిస్తున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో పుట్టిన కొత్త క‌రోనా వేరియంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించింద‌ని.. అది భార‌త్‌లోకి కూడా అడుగు పెట్టింద‌ని.. అది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని.. ఇప్ప‌టిదాకా చూసిన వేరియంట్లు అన్నింటికంటే వేగంగా విస్త‌రిస్తుంద‌ని.. అది శ‌రీరంపై చేసే దాడి కూడా ఊహించని విధంగా ఉంటుంద‌ని మ‌ల్లిక్ అన్నారు. క‌రోనా సోకింద‌ని గుర్తించేలోపు న‌ష్టం జ‌రిగిపోతుంద‌ని.. ఈ వేరియెంట్ వ‌ల్ల ఒక్క రోజులో మ‌నిషి వెంటిలేట‌ర్ మీదికి వెళ్లిపోయే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని.. దాని మీద ఏ వ్యాక్సిన్లూ ప‌ని చేయ‌వ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌పంచ అత్యుత్త‌మ వ్యాక్సిన్‌గా పేరున్న ఫైజ‌ర్ సైతం ఈ కొత్త వేరియెంట్‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని.. కోవిషీల్డ్ ప్ర‌భావం దాని మీద 10 శాత‌మే ఉంద‌ని తేలింద‌ని ఆయ‌న‌న్నారు. ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ మీద డ‌బ్బులు వృథా చేయ‌కుండా మండలానికో ఆక్సిజ‌న్ ప్లాంట్ పెట్టి ఆసుప‌త్రుల్లో వైద్య స‌దుపాయాలు మెరుగుప‌ర‌చాల‌ని.. నెల రోజుల్లోనే థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. దీనిపై ప్ర‌భుత్వాలు, నిపుణులు ఎలా స్పందిస్తారో చూడాలి.