Begin typing your search above and press return to search.

వెంక‌య్య దిగితే... అమ‌రావ‌తి స‌మ‌స్య ప‌రిష్కార‌మైన‌ట్టేన‌ట‌

By:  Tupaki Desk   |   13 Dec 2020 1:22 PM GMT
వెంక‌య్య దిగితే... అమ‌రావ‌తి స‌మ‌స్య ప‌రిష్కార‌మైన‌ట్టేన‌ట‌
X
ఏపీకి నూత‌న రాజ‌ధానిగా ఎంపిక అయిన అమ‌రావ‌తి ఇప్పుడు రాష్ట్రంలో ప‌రిష్కారం లేని స‌మ‌స్య‌గా మారిపోయింది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కావాలంటే ప్ర‌స్తుతం భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తిగా కొన‌సాగుతున్న ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు రంగంలోకి దిగాల్సిందేన‌ని సీపీఐ చెబుతోంది. ఈ మేర‌కు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శివ‌ర్గ సభ్యుడు కె.నారాయ‌ణ ఓ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. తెలుగు నేల విభ‌జ‌న స‌మ‌యంలో అన్యాయ‌మైపోతున్న ఏపీకి ప‌లు కీల‌క విష‌యాల్లో ల‌బ్ధి చేకూరేలా ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతో పాటుగా వాటిని విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర‌చ‌డంలో కీల‌క భూమిక పోషించిన వెంక‌య్య‌... ఇప్పుడు రాజ‌ధాని స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రించే దిశ‌గా చొర‌వ తీసుకోవాల‌ని నారాయ‌ణ కోరారు.

టీడీపీ హ‌యాంలో కొత్త‌గా 13 జిల్లాల‌తో ఏర్ప‌డిన ఏపీకి అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేయ‌గా... వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానికి మాత్ర‌మే ప‌రిమితం చేసేసి... పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు యోచిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ రాజధాని రైతులు నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్నారు. ఈ నెల 17 నాటికి ఈ నిర‌స‌న‌లు ఏడాది కాలాన్ని పూర్తి చేసుకోనున్నాయి. ఈ సంద‌ర్భంగా శ‌నివారం నాడు అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌కు టీడీపీతో పాటు సీపీఐ కూడా మ‌ద్ద‌తు ప‌లికింది. అంతేకాకుండా స్వ‌యంగా ఈ రెండు పార్టీల నేత‌లు కూడా మ‌హాపాద‌యాత్ర‌లో పాలుపంచుకున్నారు. ఇలా మ‌హాపాద‌యాత్ర‌లో పాలుపంచుకున్న సందర్భంగా మాట్లాడిన నారాయ‌ణ‌... ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్బంగా నారాయ‌ణ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే.... *రాజ‌ధాని విష‌యంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు జోక్యం చేసుకోవాలి. వెంక‌య్య చొర‌వ తీసుకుంటే రాజ‌ధాని అమ‌రావ‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. ప్ర‌ధాని మోదీని ఒప్పించి అమ‌రావ‌తికి వెంక‌య్య శంకుస్థాప‌న చేయించారు. అలాగే కేంద్ర భాగ‌స్వామ్యంతో రాజ‌ధాని నిర్మాణానికి స‌యోధ్య కుదిర్చారు.
అంత‌కు ముందు యూపీఏ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్‌తో మాట్లాడి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పెట్టించ‌డంలో వెంక‌య్య కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. నాడు-నేడు వెంక‌య్య‌నాయుడే ఈ మొత్తానికి స‌జీవ సాక్షి. కావున వెంక‌య్య చొర‌వ‌తోనే అమ‌రావ‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది* అని నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.