Begin typing your search above and press return to search.

వైసీపీ ఎన్డీయేలో చేరితే.. మంత్రి ప‌ద‌వులు వీరికేనా?

By:  Tupaki Desk   |   28 Jun 2021 9:30 AM GMT
వైసీపీ ఎన్డీయేలో చేరితే.. మంత్రి ప‌ద‌వులు వీరికేనా?
X
రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఏం జ‌రిగినా.. దూర‌దృష్టితోనే నేత‌లు అడుగులు వేస్తారు. అధికారాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ.. నిల‌బెట్టుకునేందుకు ప‌రుగులు తీస్తారు. ఇదే త‌ర‌హాలో ఇప్పుడు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం రెండు సార్లు బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువ‌చ్చిన మోడీ.. పూర్తిగా త‌న చ‌రిష్మానే న‌మ్ముకున్నారు. మోడీ బాట‌లోనే న‌డిచిన బీజేపీ.. ఆయ‌న పేరుతోనే గెలుపు గుర్రం ఎక్కింది. 2014, 2019 ఎన్నిక‌ల్లోపూర్తిగా మోడీ కార్డే .. బీజేపీని అధికారంలో కూర్చోబెట్టింది.

అయితే.. ఇప్పుడు ఇదే మోడీ హ‌వా స‌న్న‌గిల్లుతోంది. ధ‌ర‌లుపెరిగిపోవ‌డం స‌హా.. క‌రోనాపై ఆయ‌న అనుస‌రించిన విధానం.. జీఎస్టీ.. ఇలా.. అనేక ప‌రిస్థితులు.. ప్ర‌జ‌ల్లో మోడీపై ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. ఇక‌, యువ‌త అయితే.. త‌మ‌కు ఉద్యోగాలు ఇస్తాన‌ని మాట త‌ప్పారంటూ.. నిత్యం వంద‌ల సంఖ్య‌లో వ్య‌తిరేక పోస్టులు పెడుతున్నాయి. ఈ క్రమంలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌నాటికి.. అంటే 2024 ఎన్నిక‌ల్లో మోడీ కార్డు ప‌నిచేసే అవ‌కాశం లేద‌ని.. ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని.. బీజేపీ అధిష్టానం.. అంచ‌నా వేస్తోంది. దీనికి ఇటీవ‌ల జ‌రిగిన బెంగాల్ ఎన్నిక‌లే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.

అయితే.. అలాగ‌ని.. చేజేతులా.. కేంద్రంలో అధికారాన్ని వ‌దులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి నుంచి త‌మ‌తో క‌లిసి వ‌చ్చేమిత్రుల‌ను మ‌చ్చిక చేసుందుకు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో కేంద్ర మంత్రి వ‌ర్గం ప్ర‌క్షాళ‌న‌ను ఆయుధంగా చేసుకుని ప్రాంతీయ పార్టీల‌ను త‌న కౌగిలిలో బంధించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ద‌క్షిణాది పార్టీలైతే.. త‌న‌కు ఎదురు నిలిచే ప‌రిస్థితి లేద‌ని బీజేపీ భావిస్తోంది దీంతో త‌మిళ‌నాడులోని ప్ర‌తిప‌క్షం ఏఐఏడీఎంకు రెండు మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని.. ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

అదేస‌మ‌యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఏకంగా మూడు ప‌ద‌వులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు బీజేపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ఇలా ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చేలా వాటిని ఇప్ప‌టి నుంచే మ‌లుచుకోవ‌చ్చ‌ని బీజేపీ భావిస్తోంది. అయితే.. వైసీపీ ఎన్డీయేలో నేరుగా చేరుతుందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం లేదు. నిధులు ఇవ్వ‌డం లేదు. తెలంగాణ‌తో ఉన్న నీటి యుద్ధాన్ని ప‌రిష్క‌రించడం లేదు. అదేస‌మ‌యంలో ఎంపీ ర‌ఘురామ‌పై వేటు వేయ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో అస‌లు ఎన్డీయేలో చేరుతుందా? అనే ప్ర‌శ వ‌స్తోంది.

అయితే.. అదేస‌మ‌యంలో చేరితేనే మంచిద‌ని .. కొంద‌రు వైసీపీ నేత‌లు చెబుతున్నారు. కేబినెట్‌లో చేరితే.. మ‌రింత ఒత్తిడి పెంచేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా నిధులు సాధించుకునేందుకు అవ‌కాశం వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ క‌నుక‌.. ఎన్డీయే కూట‌మిలో చేరితే.. కేబినెట్‌లో మూడు స్థానాలు ఖ‌చ్చితంగా ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.వీటిలో ఒక‌టి రెడ్డి సామాజిక వ‌ర్గానికి, ఒక‌టి ఎస్సీల‌కు, మ‌రొక‌టిబీసీల‌కు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని కూడా అప్పుడే లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.