Begin typing your search above and press return to search.

హిందీ మాట్లాడకుంటే దేశం వీడి వెళ్లాలట!

By:  Tupaki Desk   |   30 April 2022 10:32 AM GMT
హిందీ మాట్లాడకుంటే దేశం వీడి వెళ్లాలట!
X
సున్నిత అంశాలు.. ముఖ్యంగా ప్రాంతం, భాష, మతం, కులం వంటి విషయాల్లో మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, చట్టసభల సభ్యులు, మంత్రులు ,ముఖ్యమంత్రుల స్థానాల్లో ఉన్నవారు. అయితే, ఇవన్నీ బాధ్యతాయుత వ్యక్తులకు. ఎంతటి పదవిలో ఉన్నా నోరు జారితే వెనక్కు తీసుకోవడం కష్టం. ఇలాంటి ఉదాహరణలు గతంలో ఎన్నో చూశాం. ఆ తర్వాత నాయకులులు తమ ప్రకటనలను ఖండించడమో.. వక్రీకరించారంటూ మీడియా మీదకు తోసేయడమో చేస్తుంటారు. కానీ, అప్పటికే వారి ఉద్దేశం, ఏ సమయంలో మాట్లాడినదీ ప్రజలకు తెలిసిపోతూనే ఉంటుంది. వాస్తవం అవగతం అవుతూనే ఉంటుంది.

హిందీ నిప్పుల్లో చమురు

దేశంలో ప్రస్తుతం హిందీ భాష రగడ నడుస్తోంది. హిందీ జాతీయ భాషనా? కాదా? అనేదానిపై ఎప్పటినుంచో అనేక ఆందోళనలు సాగుతున్నాయి. సహజంగానే దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువ కావడంతో ఆ భాష ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ ఒక భాషను ఎక్కువ మరొక భాషను తక్కువ చేయలేం. అసలు.. ఒక భాష మరొక భాషకు గొప్పదనంలో సంబంధమే లేదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ, నోటికి అదుపు ఉండని ఉత్తరాది నేతలే హిందీ విషయంలో ఎక్కువగా ప్రేలాపనలు పేలుతుంటారు. తాజాగా యూపీ మంత్రి సంజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిందీ మాట్లాడితేనే దేశంలో ఉండాలా?

భారత దేశం అంటే అనేక భాషల సమ్మేళనం. వైవిధ్యానికి మారు పేరు. ఎంతగొప్పటి విభిన్నత అంటే.. ఈశాన్యంలోని మేఘాలయాకు పశ్చిమంలోని మహారాష్ట్రకు పోలికే ఉండదు. అంతటి భిన్నత్వం మరే దేశంలోనూ బహుశా కనిపించదు. అందుకే మనది ఉప ఖండం అయింది.

కానీ, సంజయ్ నిషాద్ వంటి కొందరు దీనికి తూట్లు పొడుస్తుంటారు. తాజాగా ఈ యూపీ మంత్రి మాట్లాడుతూ.. హిందీ మాట్లాడని వారు దేశం విడిచి వెళ్లాలని అన్నారు. హిందీని ప్రేమించనివారు విదేశీయులని.. లేదా విదేశాలతో సంబంధాలు ఉన్నవారని నిందించారు. అంతేగాక..ఇండియా అంటే హిందూస్థాన్ అని రాజ్యాంగం చెబుతున్నదని, హిందీ మాట్లాడేవారి ప్రాంతమని అన్నారు.

అంటే మిగతా 53 శాతంమంది సంగతేమిటి.?

యూపీ మంత్రి వ్యాఖ్యలే నిజమైతే.. దేశంలో 53 శాతం మంది ప్రజలు బయటకు వెళ్లిపోవాలి. భారత్ లో హిందీ మాట్లాడేవారి సంఖ్య 53 కోట్లు. శాతంలో చూస్తే ఇది 47 శాతం. బెంగాలీ మాట్లాడేవారు 8 శాతం, మరాఠీ మాట్లాడేవారు 6.86 శాతం, తెలుగు భాషించేవారు 6.70 శాతం, తమిళం మాట్లాడేవారు 5.80 శాతం ఉన్నారు. మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడినంత మాత్రాన హిందీ మెజారిటీ భాష అయింది.

కానీ, ఎందుకనో ఈ భాషను మా మీద రుద్దుతున్నారు అనే భావన దక్షిణాది ప్రజలపై మొదటినుంచీ ఉంది. ఇలాంటి సమయంలోనే ఇటీవల కన్నడ, తెలుగు నటుడు సుదీప్.. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ మధ్య తలెత్తిన రగడను చూడాల్సి ఉంది. దీనికి మరింత ఆజ్యం పోసేలా ఉంటాయి. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాల్సింది ప్రజలే.