Begin typing your search above and press return to search.

పార్టీలో చేరితే కాసుల గ‌ల‌గ‌ల‌.. మునుగోడు జ‌నం ఏం చేస్తున్నారంటే!

By:  Tupaki Desk   |   10 Oct 2022 1:30 PM GMT
పార్టీలో చేరితే కాసుల గ‌ల‌గ‌ల‌.. మునుగోడు జ‌నం ఏం చేస్తున్నారంటే!
X
ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు నాయ‌కులు చేస్తున్న ప్ర‌యోగాలు.. జ‌నాల‌కు కాసుల పంట పండి స్తున్నాయి. మునుగోడులో త‌మ త‌మ పార్టీల బ‌లం పెంచుకునేందుకు నాయ‌కులు చేస్తున్న ప్ర‌యోగాల ను కొంద‌రు యువ‌కులు.. నాయ‌కులు కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పార్టీలో యువ‌త‌ను.. ఇత‌ర నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు బీజేపీ స‌హా.. కాంగ్రెస్‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎవ‌రు వ‌చ్చినా.. ఇంత‌ని ముట్ట‌జెప్పి.. పార్టీ కండువా క‌ప్పేస్తున్నారు.

అయితే.. ఉద‌యం ఒక పార్టీలో చేరి..ఇంత‌ని ద‌క్కించుకున్న స‌ద‌రు వ్య‌క్తులు సాయంత్రం అయ్యే స‌రికి మ‌రో పార్టీలో చేరి.. మ‌రికొంత ద‌క్కించుకుంటున్నారు. అనంత‌రం.. తీరిగ్గా వేరే ఊరుకు వెళ్లిపోతున్నారు. దీంతో డ‌బ్బులు పంచి మ‌రీ పార్టీల్లోని యువ‌త‌ను ఆక‌ర్షిస్తున్న పార్టీలు త‌ల ప‌ట్టుకుంటున్నాయి. మును గోడు ఉప ఎన్నిక బరిలో ప్రచారంతోపాటు బేరసారాలు హోరెత్తుతున్నాయి. సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఛోటామోటా నాయకుల 'కొనుగోళ్లు' యథేచ్ఛగా సాగుతున్నాయి.

నాయకుల హోదాను బట్టి ప్రధాన పార్టీలు ధర నిర్ణయించి వారికి కొన్ని 'బాధ్యతలు' అప్పగిస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకులను, ఓటర్లను ఆకర్షించే ప్రక్రియలో నజరానాలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా దక్కించుకోవచ్చని పార్టీల ఆలోచన. రెండు ప్రధాన పార్టీల నాయకులు.. మరో ప్రధాన పార్టీ శ్రేణులపైనే గురి పెట్టడం గమనార్హం.

పార్టీ కండువా కప్పుకొంటే రూ. వెయ్యి, రెండు వేలు ఇస్తుండగా.. తాజాగా ఒక నాయకుడు తన సొంత సొమ్ముతో దాన్ని మరింత పెంచేశాడు. తమ పార్టీలో చేరే యువకునికి రూ.10 వేలు, ఇంకో నలుగురిని తీసుకొస్తే మరో రూ. 50 వేలు నజరానాగా ఆయన పంచినట్లు తెలిసింది. పోటాపోటీ స్థితిని అదనుగా తీసుకుని.. కొందరు ఛోటా నాయకులు అటూ ఇటూ మారుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పార్టీ కండువా కప్పుకొని.. మారితే ఇంకా ఎక్కువిస్తారా అని అవతలి పార్టీతో బేరమాడుతున్నారు.

ఉదాహరణకు చౌటుప్పల్‌ మండలంలో పలువురు యువకులు ఓ పార్టీలో చేరారు. అందుకుగాను వారికి ఉదయమే కానుకలు దక్కాయి. వారిలో రూ. 10 వేలు తీసుకున్న యువకుడు మధ్యాహ్నానికి అవతలి పార్టీలో చేరిపోయాడు. అక్కడ అంతకు రెట్టింపు ముట్టజెప్పినట్టు తెలిసింది. దీంతో అతడిని మళ్లీ వెనక్కి తీసుకురావాలని మొదటి పార్టీ వారు ప్రయత్నిస్తున్నారు.

ఇక‌,. వార్డు సభ్యులు, ఉపసర్పంచుల వంటి వారి చేతుల్లో 50, 100 ఓట్లుంటే చాలు.. రూ. 50 వేలకు పైగా నగదు ముట్టజెబుతున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లిన వారికి నచ్చజెప్పి.. నజరానాలిచ్చి వెనక్కి తెచ్చుకుం టున్నారు. ఓ పార్టీ పోలింగ్‌బూత్‌కు, మరో పార్టీ ఎంపీటీసీ స్థానానికి ఇన్‌ఛార్జులుగా రాష్ట్ర అగ్రనాయకు లను నియమించారు. వారు తమ పార్టీ పెద్దల మెప్పు పొందేందుకు.. తమ సొంత సొమ్ముతో నజరానాలకు తెరతీస్తున్నట్లు సమాచారం. మ‌రి ఇది ఎలాంటి 'ఫ‌లితాన్ని' ఇస్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.