Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు: నిందితుడు సింహయాజులు స్వామి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   31 Oct 2022 12:30 PM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు: నిందితుడు సింహయాజులు స్వామి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కే
X
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం వేడి ఇప్పటికీ తగ్గడం లేదు. ఆడియో కాల్స్ వరుసగా విడుదల అయ్యి తెలంగాణలో సంచలనం సృష్టించాయి. ఈ కేసులోని నిందితులు ఎవరు? బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు కీలకంగా మారారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో అడ్డంగా బుక్కైన నందు, రామచంద్రస్వామీజీ, సింహయాజులు స్వామి నిందితులుగా ఉండగా.. ప్రస్తుతం వారిని సైబరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈకేసులో ఏ3గా ఉన్న సింహయాజులు స్వామి గురించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సింహయాజులు స్వామీది ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని రామనాథపురం గ్రామం అని తెలుస్తోంది.

సింహయాజులు స్వామి అసలు పేరు అశోక్ గా పోలీసులు గుర్తించారు. గతంలో సొంత గ్రామంలో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ను సింహయాజులు ప్రారంభించారు. నష్టాలు రావడంతో ఆ స్కూల్ ను మూసేసి చిన్నమండెంలోని చిన్న ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత పీఠాధిపతిగా మారి సింహయాజులు స్వామిగా పేరు మార్చుకున్నారు.

తిరుపతి నుంచి వచ్చిన ఓ స్వామిజీ అశోక్ స్వస్థలమైన రామనాథపురంలో పీఠం ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల తర్వాత దానికి అశోక్ ను పీఠాధిపతిగా చేసి సింహయాజులు స్వామిగా ఆయన గురువు పేరు మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సింహయాజులు స్వామి పూజలు, హోమాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని అప్పుడప్పుడు మాత్రమే గ్రామానికి వస్తూ వెళుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు.

ఇటీవల దసరా సమయంలో గ్రామానికి వచ్చారని.. గ్రామంలో జరిగిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. చాలా మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో ఆయనకు సంబంధాలుండేవని తేలింది.

ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండేవారని.. పండుగల సమయంలో మాత్రమే గ్రామానికి వస్తూ ఉంటారని చెబుతున్నారు. టీవీలో ఆయన పేరు రావడం చూసి ఆశ్చర్యపోయామని గ్రామస్థులు అంటున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటీవల విడుదలైన ఆడియోలో రామచంద్రభారతి, సింహయాజీ అనే స్వామీజీలతో నందకుమార్ ఈ ఆడియోలో మాట్లాడినట్టు తెలుస్తోంది. నెలరోజుల్లో టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చడమే లక్ష్యంగా ఈ ఆడియోలో ఏజెంట్ లు స్వయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో మాట్లాడారు. సింహయాజీ ఇందులో కీలక పాత్ర పోషించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.