Begin typing your search above and press return to search.

బేగంపేటలో జరిగిన ప్రజా ఓటింగ్ ఫలితాలు తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!

By:  Tupaki Desk   |   14 Feb 2022 8:30 AM GMT
బేగంపేటలో జరిగిన ప్రజా ఓటింగ్ ఫలితాలు తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!
X
ప్రభుత్వాలు అనుసరించే విధానాలకు.. ప్రజలకు మధ్య అంతరం ఎంత ఉంటుందన్న విషయాన్ని చాటి చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు. తమకు నేరుగా నొప్పి కలిగినా.. తమ రాజకీయ అధికారానికి ఇబ్బంది కలిగినా ఇట్టే స్పందించే ప్రభుత్వాధినేతలు.. సాధారణ ప్రజల డిమాండ్లను వినే ఓపికా.. తీరికా లేని పరిస్థితి.

ఇలాంటి సందర్భాల్లో కొన్ని సంస్థలు అనుసరించే విధానాలు ప్రభుత్వాలకు చెంప పెట్టుగా మారుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. దీనికిసంబంధించిన వివరాలు తెలిసినంతనే నోటి నుంచి ఆటోమేటిక్ గా ‘వావ్’ అన్న మాట రాకుండా మానదు.

హైదరాబాద్ మహానగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాల్లో బేగంపేట ఒకటి. అందులోని గురుమూర్తి లేన్ లో ఒక వైన్ షాపును ఏర్పాటు చేశారు. దీనిపై అక్కడి స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వైన్ షాపును ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇలాంటివేళ.. ‘హక్కు ఇన్షియేటివ్‌ అండ్‌ ఛానల్‌’ అనే సంస్థను అక్కడి స్థానికులు ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఆ సంస్థ శనివారం సిటిజన్ రెఫరెండమ్ పేరుతో గురుమూర్తి లేన్ నివాస.. వాణిజ్య కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఓటింగ్ నిర్వహించారు.

ఈ ఓటింగ్ ఎజెండా చాలా సింఫుల్. మీ ఏరియాలో ఉన్న వైన్ షాపులు ఉండటం మీకు ఇష్టమేనా? అన్న ప్రశ్నను అడిగి.. అవును.. కాదు అన్నది పేర్కొనాలని చెప్పారు. ఈ మొత్తం ఓటింగ్ లో 1479 మంది ఓట్లు వేశారు. దీనికి సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియను ఆదివారం చేపట్టారు.

మొత్తం 1479 మంది ఓటు వేసిన వారిలో 95.67 శాతం అంటే 1415 మంది తమకు వైన్ షాపు వద్దంటూ ‘నో’ అని ఓటు వేస్తే.. 3.58 శాతం మంది అంటే 53 మంది కావాలని అనుకూలంగా ఎస్ అంటూ ఓటు వేశారు. మొత్తం 11 ఓట్లు చెల్లలేదు. ఓట్లు వేసిన వారిలో 50.16 శాతం మంది పురుషులు.. 49.8 శాతం మంది మహిళలు ఉన్నారు.

తాజాగా నిర్వహించిన పోలింగ్ కు సంబంధించిన ఫలితాల ఆధారంగా తాము కోర్టును ఆశ్రయించనున్నట్లుగా సంస్థ సభ్యులు చెబుతున్నారు. దీనిపై కోర్టు ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.గతంలో ఇదే సంస్థ సికింద్రాబాద్ లోనూ.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వైన్ షాపులు ఏర్పాటు విషయంలో స్థానికుల వినతితో ఈ తరహా ఎన్నికలు నిర్వహించింది.

ప్రజాక్షేత్రంలో ప్రజావాణిని కోర్టు విని.. నిర్ణయం తీసుకోవటానికి ముందే.. ప్రభుత్వమే స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ ఓటింగ్ ఫలితాలు సీఎం కేసీఆర్ వరకు వెళతాయా? అన్నది కాలమే సమాధానం ఇవ్వాలి.