Begin typing your search above and press return to search.

ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకుంటే ఆ మాత్రం మూల్యం చెల్లించాలి కదా?

By:  Tupaki Desk   |   27 April 2022 9:30 AM GMT
ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకుంటే ఆ మాత్రం మూల్యం చెల్లించాలి కదా?
X
సమస్యల్ని చెప్పుకునేందుకు అధికారంలో ఉన్న వారికి చెప్పుకునే వెసులు బాటు ఉంటే చాలానే సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి. ఎప్పుడైతే పదవులు చేతికి వస్తాయో.. అప్పటి నుంచి మొత్తం తీరు మారిపోవటం మామూలే. అధికారం చేతికి వచ్చినప్పుడు ఆ మాత్రం చెలాయించకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఏపీలాంటి రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకోవాలన్న ఆలోచనే సాహసం అవుతుంది. అలాంటిది సదరు ఎమ్మెల్యే కారును అడ్డుకునే ప్రయత్నం చేసిన సామాన్యుడ్ని వదిలేస్తారా? తాజాగా ఇలాంటి ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఆ తర్వాత ఏమైందన్నది చూస్తే..

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన రాఘవయ్య అనే వ్యక్తి.. గ్రామంలోని రోడ్డు.. కాలువలకు సంబంధించిన సమస్యల్ని చెప్పేందుకు స్థానిక ఎమ్మెల్యే తమ ప్రాంతానికి వస్తున్న వేళ.. ఆయన్ను అడగాలని బలంగా డిసైడ్ అయ్యాడు. ఎమ్మెల్యే వాహనం వచ్చే రహదారికి అడ్డంగా తన వాహనాన్ని నిలిపి.. తాను రోడ్డు మీద నిలబడ్డాడు. రోడ్డుకు అడ్డంగా పెట్టటంతో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తన వాహనాన్ని ఆపాల్సి వచ్చింది.

ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకు అంతకు మించిన అవమానం ఏముంటుంది చెప్పండి? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ఎవరైనా ఇలా అడ్డు తగిలితే ఎమ్మెల్యే సారు వారికి ఎంత కోపం వస్తుంది.

అలానే టీజేఆర్ సుధాకర్ బాబుకు అలానే వచ్చింది. ఎమ్మెల్యే మూడ్ కు తగ్గట్లే అనుచర గణం రియాక్టు కావటంతో రాఘవయ్యతో వాగ్వాదానికి దిగారు. చివరకు ఆయన్ను.. ఆయన వాహనాన్ని నెట్టేసి వారి దారిన వారు వెళ్లారు.

కట్ చేస్తే.. కాసేపటికి రాఘవయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ మార్కును ఆయనపై చూపించారు. తన వాహనాన్ని అడ్డుకున్నారంటూ ఎమ్మెల్యే ఇచ్చిన మౌఖిక సమాచారంతో రాఘవయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను ఉతికి ఆరేశారంటున్నారు.

ఈ సందర్భంగా చేతి వేలికి గాయమైందని చెబుతున్నారు. అయితే.. పోలీసులు మాత్రం ఎమ్మెల్యే నుంచి అందిన సమాచారంతో రాఘవయ్యను అదుపులోకి తీసుకున్నామే తప్పించి.. ఆయన్ను అస్సలు కొట్టలేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం మందలించి మాత్రమే పంపామంటున్న వైనం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.