Begin typing your search above and press return to search.

విజయం సాధించామంటున్న రాహుల్‌గాంధీ!

By:  Tupaki Desk   |   9 Jun 2015 5:54 AM GMT
విజయం సాధించామంటున్న రాహుల్‌గాంధీ!
X
కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ సెలబ్రేషన్స్‌ చేసుకొనే సమయమిది అని అంటున్నాడు. తాము మోడీ ప్రభుత్వంపై విజయం సాధించామని ఆయన ప్రకటించుకొన్నాడు. మోడీ ప్రభుత్వం వెనుకడుగు వేసింది.. తాము పై చేయి సాధించామని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించాడు. మరి ఉన్నఫలంగా కాంగ్రెస్‌ యువరాజుకు ఈ సెలబ్రేషన్స్‌ ఏమిటి? అంటే.. ఇది మద్రాస్‌ ఐఐటీకి సంబంధించిన వ్యవహారంలో రాహుల్‌గాంధీ స్పందన ఇది.

మద్రాస్‌ ఐఐటీ ఒక విద్యార్థిసంఘం నిషేధంపై తమ పోరాటం ఫలించిందని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించాడు. ఇక్కడ మోడీని విమర్శించారనే కారణం చూపుతూ ఒక విద్యార్థి సంఘంపై నిషేధం పడటం విదితమే. ఈ అం శంలో కేంద్రమానవ వనరుల శాఖ కూడా జోక్యం చేసుకొంది. నిషేధాన్ని సమర్థించింది. దీంతో ఈ వ్యవహారంలోకి కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎంట్రీ ఇచ్చింది. స్వయంగా రాహుల్‌గాంధీ ఆ విద్యార్థి సంఘానికి మద్దతు ప్రకటించాడు. దాని కార్యకలాపాలపై నిషేధం విధించడం అన్యాయమని ట్విటర్‌లో గళం విప్పాడు.

ఇలాంటి నేపథ్యంలో మద్రాస్‌ ఐఐటీ ఆ విద్యార్థి సంఘంపై నిషేధం ఎత్తేయడం జరిగింది. అనవసర వివాదం సృష్టించిన వర్సిటీ అధికారులు చివరకు వెనక్కుతగ్గారు. విద్యార్థి సంఘంపై నిషేధం ఎత్తి వేశారు.

ఇది కాంగ్రెస్‌యువరాజుకు అనందకరమైన అంశంగా మారింది. స్వయంగా ఆయనే సెలబ్రేషన్స్‌ అంటున్నాడు. మోడీ ప్రభుత్వం వెనుకడుగు వేసిందని.. ఇది తమ విజయమని రాహుల్‌ ప్రకటించుకొన్నాడు.

మరి వాస్తవంగా చూస్తే ఇదేం అంతపెద్ద మ్యాటరేమీ కాదు. కాంగ్రెస్‌కు సంబంధించింది కాదు. అయినా రాహుల్‌ దీన్ని విజయంగా పేర్కొంటూ సెలబ్రేషన్స్‌ చేసుకోవాలని అంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.