Begin typing your search above and press return to search.

అమరావతిపై ఐఐటీ మద్రాస్ నివేదిక.. ఒట్టిదేనట!

By:  Tupaki Desk   |   17 Jan 2020 1:30 AM GMT
అమరావతిపై ఐఐటీ మద్రాస్ నివేదిక.. ఒట్టిదేనట!
X
నవ్యాంధ్ర నూతన రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లెక్కలేనన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు నేల విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా ఏర్పాటైన నవ్యాంధ్రకు అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ గత టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా స్పందించిన గుంటూరు జిల్లా రైతులు ఏకంగా 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ పద్దతిలో ఇచ్చారు. ఇదంతా గతం అనుకుంటే... మొన్నటి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత సీఎం కుర్చీని ఎక్కిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రాజధానిని మూడు ముక్కలు చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ కు పరిమితం చేస్తూ, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖలో, జ్యూడిషియల్ కేపిటల్ ను కర్నూలులో ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో అమరావతిలో వెల్లువెత్తిన నిరసనలను చల్లార్చేందుకు పలు రకాల వాదనలు తెర మీదకు వచ్చాయి. ఈ క్రమంలో ఐఐటీ మద్రాస్ కూడా రాజధానిగా అమరావతి సాధ్యం కాదని ఓ నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే రాజధానిగా అమరావతి తగదని తామెలాంటి నివేదిక ఇవ్వలేదంటూ ఇప్పుడు ఐఐటీ మద్రాస్ సంచలన కామెంట్ చేసింది.

రాజధానిపై తనదైన శైలిలో మూడు రాజధానుల వాదనను బలపరచుకునే నిమిత్తం వైసీపీ సర్కారు... జీఎన్ రావు నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ అతి తక్కువ కాలంలోనే రాష్ట్రమంతా పర్యటించి మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇదేనంటూ మొన్న నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో జగన్ చెప్పిన మాటలను బలపరుస్తూ... జీఎన్ రావు కమిటీ కూడా మూడు రాజధానులకు జైకొట్టింది. ఇక జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపుప కూడా జగన్ వాదనను బలపరుస్తూ మూడు రాజధానులకు జైకొట్టేసింది. ఇదే అదనుగా ఐఐటీ మద్రాస్ కూడా రాజధానిపై అధ్యయనం చేసి ఓ నివేదికను సమర్పించిందని, అమరావతిలో రాజధాని నిర్మాణానికి అనువైన భూములు లేవని, ఒకవేళ అమరావతిలోనే రాజధాని నిర్మాణాన్ని చేపడితే ఖర్చు తడిసిమోపెడవుతుందని పేర్కొందన్న ఓ వాదనను కొందరు తెర మీదకు తెచ్చారు.

అయితే తమకు తెలియకుండా ఐఐటీ మద్రాస్ ఎప్పుడు అధ్యయనం చేసిందన్న అనుమానం వచ్చిన రాజధాని రైతులు అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే పనిని మొదలెట్టేశారట. ఈ క్రమంలో ఐఐటీ మద్రాస్ కు రాజధాని రైతులు లేఖలు రాశారట. రాజధాని అమరావతిపై మీరు అధ్యయనం చేశారా? అంటూ రాజధాని రైతులు అడిగిన ప్రశ్నకు... ఐఐటీ మద్రాస్ రెండే రెండు ముక్కల్లో సమాధానం చెప్పేసిందట. రాజదాని అమరావతిపై తాము అధ్యయనం చేయలేదని ఐఐటీ మద్రాస్ తేల్చేసింది. రాజధాని అమరావతిపై అధ్యయనం చేయమని తమను ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ కోరలేదని, అదే సమయంలో తమకు తాముగా కూడా అమరావతిపై ఎలాంటి నివేదికను రూపొందించలేదని కూడా ఐఐటీ మద్రాస్ రైతులకు సమాధానం ఇచ్చిందట. దీంతో రాజధానిపై ఐఐటీ మద్రాస్ నివేదిక అంటూ సాగిన ప్రచారానికి తెర పడిందన్న మాట.