Begin typing your search above and press return to search.

దళితుల భూములకు మంత్రి ఎసరు..?

By:  Tupaki Desk   |   2 March 2019 10:30 AM GMT
దళితుల భూములకు మంత్రి ఎసరు..?
X
మంత్రి పదవిని ఆసరాగా చేసుకొని 50 అడుగుల గుట్టను చదును చేసి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు పెద్దాపురంలో వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగంపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఆ మంత్రి నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వస్తున్నా ఎక్కడా చర్యలు తీసుకోకపోవడం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది..

తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మండలం రామేశ్వరంపేట గ్రామం అది. ఈ గ్రామ పరిధిలో సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు ఉన్న కొండలు కనిపించేవి. కానీ ఇప్పుడు అవి కనుమరుగయ్యాయి. ఈ కొండలపై ఆధారపడి ఆనూరు - కొండపల్లి - రామేశ్వరంపేట - సూరంపాలెం - వాలు తిమ్మాపురం గ్రామాలకు చెందిన దళితులు జీవించేవారు. వీరికి తోడుగా 2005 సంవత్సరంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇందిరా క్రాంతి - ఇందిరా జల ప్రభ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 72 బోర్లను వేయించారు. వీటితో డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం ద్వారా పంట పొలాలకు నీరందించారు.

అప్పటి వరకు అక్కడి ప్రజలు కూరగాయలు - ఆకుకూరలు పండిస్తూ జీవనాన్ని సాఫీగా సాగించారు. కానీ టీడీపీ అధికారంలోకి రావడమే తరువాయి వచ్చిన అవకాశాన్ని పార్టీకి చెందిన ఓ మంత్రి చేజేతులా క్యాష్ చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. కొండలను కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారని స్థానిక దళితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ సాఫీగా జీవనం సాగిస్తున్న దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయింకొని వారు సాగు చేసుకుంటున్న భూములను లాక్కున్నట్లు ఆరోపిస్తున్నారు.. ఫలితంగా ఈ కొండల ద్వారా ఆ మంత్రి రూ.100 కోట్ల వరకు సంపాదించాడని దళితులు ఆరోపిస్తున్నారు. దాదాపు 200 ఎకరాల వరకు చదును చేశారని వారు చెబుతున్నారు.

వైసీపీ , సీపీఐ, సీఎం నాయకులు ఆందోళనా చేసినా టీడీపీ నేతలు మంత్రి సిఫార్సులతో అధికారుల సమక్షంలో కొండలను గుల్ల చేసి కోట్లను ఆర్జిస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు.. నాలుగేళ్లుగా ఇదే కొండలను తవ్వుతూ 800 మంది దళితుల నోట్లో మట్టి కొట్టారని వారు వాపోతున్నారు. ఇదంతా పెద్ద పురం నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో సాగిస్తున్న దందా అని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి.. దళితుల సాగు చేస్తున్న గుట్టల భూముల్లో బోర్‌ వెల్‌ ను వేసుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడం లేదట... కానీ ఎలాంటి అనుమతి లేకుండా కొండను తవ్వడంపై అధికార బలంతోనేనని ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు రికార్డులు సృష్టించి ఇక్కడ క్వారీ తవ్వకాలు జరుపుతున్నారని దళితులు, ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

పెద్దాపురంలో ఇప్పటివరకు 1200 కోట్ల అభివృద్ధి జరిగిందని సదురు మంత్రి చెబుతున్నా.. అందులో 50శాతం అవినీతి చోటుచేసుకుందని నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.. పెద్దాపురం బస్సు కాంప్లెక్ నిర్మాణంలో దాదాపు 50 లక్షల వరకు నిధులు స్వాహా చేశారని అంటున్నారు.. సంత మార్కెట్ లో రూ.లక్షల బిల్లులు స్వాహా అయ్యాయని.. మున్సిపల్ పార్కు నిర్మాణంలో రెండు కోట్ల కేటాయింపుల్లో కోటి వరకూ అవినీతి జరిగినట్టు స్థానికులు లెక్కలు వేసి మరి ఆరోపిస్తున్నారు.

ఇక నీరు చెట్టు - ఆస్పత్రి అభివృద్ధి - కోటమ్మ-నీలమ్మ చెరువు అభివృద్ధి - బస్ షెల్టర్లు - రేకుల షెడ్లు - అనధికార లేఅవుట్లు - ఇలా అన్నింటిలోనూ కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినట్లు స్థానికులు పనులను చూపించి మరీ ఎండగడుతున్నారు. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.