Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ దొరికేసిందిగా.. పొలిటిక‌ల్ వైబ్రేష‌న్స్‌

By:  Tupaki Desk   |   31 Oct 2022 9:30 AM GMT
హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ దొరికేసిందిగా.. పొలిటిక‌ల్ వైబ్రేష‌న్స్‌
X
వ‌ద్దంటే డ‌బ్బు.. అదేంటో రూపాయి లేద‌ని.. అప్పులు చేస్తున్న తెలంగాణ‌లో ఇప్పుడు ఏ వాహ‌నాన్ని ఆపినా ల‌క్ష‌ల్లో సొమ్ము క‌నిపిస్తోంద‌ని పోలీసులు చెబుతున్నారు. మ‌రి ఇది మునుగోడు ఉప ఎన్నిక మ‌హ‌త్య‌మా? లేక మ‌రేమో తెలియ‌దు కానీ పోలీసులు వాహ‌నాల‌ను మాత్రం తెగ జ‌ల్లెడ ప‌ట్టేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో కారులో తరలిస్తున్న రూ.90 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మ‌రోవైపు గురువారం మునుగోడు ఉపఎన్నిక జ‌ర‌గ‌నుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎలాగైనా మునుగోడు పీఠాన్ని దక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంచుతున్నట్లు సమాచారం. దీనిపై దృష్టి పెట్టిన పోలీసుల‌కు ఈ సొమ్ము హైద‌రాబాద్ నుంచి మునుగోడుకు చేరుతోంద‌ని తెలుసుకున్నారు.

దీంతో హైద‌రాబాద్ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే మార్గాల్లో అది ఏదైనా స‌రే.. ప‌క్కా నిఘా పెట్టారు. రేయింబ‌వ‌ళ్లు కాప‌లా కాస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నంబర్ 71లో ఓ కారులో రూ.90 లక్షల నగదు తరలిస్తుండగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అతణ్ని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇదిలావుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం దాదాపు 100 కోట్ల‌కు పైగానే ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి ఇదంతా దేనికి తెస్తున్నారో .. ఎవ‌రికి ఇస్తున్నారో అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మేన‌ని అంటున్నారు పోలీసులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.