Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: కేసీఆర్ కు అస్వస్థత

By:  Tupaki Desk   |   11 March 2022 7:31 AM GMT
బ్రేకింగ్: కేసీఆర్ కు అస్వస్థత
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు.

కేసీఆర్ కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలను వైద్యులు నిర్వహించారు. కేసీఆర్ రెండ్రోజులుగా నీరసంగా ఉన్నారని, ఎడమ చేయి లాగుతోందని చెప్పారని యశోదా ఆస్పత్రి వైద్యుడు ఎన్‌వి రావు తెలిపారు.

కేసీఆర్ కు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నామని, నివేదికలు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం వెల్లడిస్తామని తెలిపారు.

అస్వస్థతకు గురైన నేపథ్యంలో కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సీఎం కేసీఆర్ సతీసమేతంగా యాదాద్రికి వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నేడు తిరుకళ్యాణం వేడుక జరగనుంది. ఈ నెల 28వ తేదీన యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభం కాబోతోంది.

ఈ నేపథ్యంలో పున:ప్రారంభోత్సవ ఏర్పాట్లు, మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై అధికారులతో ఈ రోజు కేసీఆర్ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లు, భక్తులకు కల్పించే సౌకర్యాలపై అధికారులతో చర్చించాల్సి ఉంది. దీంతో, సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు జరుగగా..చివరి నిమిషంలో పర్యటన రద్దయింది.

కాగా, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో కొద్ది రోజులుగా కేసీఆర్ వరుస పర్యటనలతో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ కోసం ముంబయి, ఢిల్లీ, జార్ఖండ్ లలో పర్యటించారు.

ఆ తర్వాత బడ్జెట్ పై కసరత్తు చేశారు. ఇలా, వరుస పర్యటనలు, అధికారులతో సమీక్షల కారణంగా ఒత్తిడికి గురికావడం వల్లే కేసీఆర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.