Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ఎమర్జెన్సీ.. బయటకు రావద్దని హెచ్చరిక!

By:  Tupaki Desk   |   7 Nov 2017 11:17 AM GMT
ఢిల్లీలో ఎమర్జెన్సీ.. బయటకు రావద్దని హెచ్చరిక!
X

మ‌న దేశ రాజధానిలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. మంగళవారం ఉదయమే దట్టమైన పొగమంచు ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. స్కూళ్లను మూసేయాల్సిందిగా సూచించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సలహా ఇచ్చింది. కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయిని మించడంతో ఈ నెల 19న జరగాల్సిన మారథాన్‌ ను కూడా రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ను మెడికల్ అసోసియేషన్ కోరింది.

వాస్త‌వానికి సోమవారం సాయంత్రం నుంచే కాలుష్యం పెరగడం కనిపించింది. పొగమంచు తీవ్రం కావడంతో పక్కనున్న మనిషి కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఉదయం 10 గంటలకే కాలుష్య స్థాయి ప్రమాదకరంగా ఉన్నట్లు రికార్డయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్‌ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలిలో పీపీఎం స్థాయి 420గా చూపించగా.. ఆనంద్ విహార్‌ లో అది 319గా ఉంది. ఇక ఇది పంజాబీ బాగ్‌ లో అత్యధికంగా 999గా - ఆర్కే పురంలో 852గా నమోదైంది. ఇది 50లోపు ఉంటే కాలుష్యం చాలా తక్కువగా ఉందని, 401కి పైన ఉంటే ప్రమాదకర స్థాయి అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వివ‌రించింది.

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణ స్థాయిలు క‌నిపించినందుకు తాము ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వివ‌రించింది. చలికాలం కావడం, గాలిలో కాలుష్యం కార‌ణంగా ఈ ప‌రిస్థితులు ఎదుర‌య్యాయ‌ని ఐఎంఏ పేర్కొంది.