Begin typing your search above and press return to search.

వైద్యుల రక్షణ పట్ల ప్రధాని జోక్యం అవసరం: ఐఎంఏ

By:  Tupaki Desk   |   7 Jun 2021 6:30 AM GMT
వైద్యుల రక్షణ పట్ల ప్రధాని జోక్యం అవసరం: ఐఎంఏ
X
వైద్యులకు రక్షణ కల్పించాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలని కోరింది. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పీఎంకు ఐఎంఏ లేఖ రాసింది. ప్రాణం పోసే వైద్యులపై జరుగుతున్న శారీరక, మానసిక దాడుల పట్ల కేంద్రం ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేసింది.

కావాలనే కొందరు ఆధినిక వైద్యంపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించింది. స్వార్థ ప్రయోజనాల కోసం వ్యాక్సినేషన్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా అల్లోపతి వైద్య విధానంపై బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఐఎంఏ తీవ్రంగా ఖండించింది. తప్పుడు ప్రచారాలను అరికట్టడంలో ప్రధాని చొరవ చూపాలని కోరింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర కాలంలో వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్నారని తెలిపింది. ఈ పోరాటంలో 1400 మంది డాక్టర్లు అసువులు బాసారని గుర్తు చేసింది. ఇంకా చాలామంది వైరస్ బారిన పడ్డారని పేర్కొంది. ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో రోగులు మృతి చెందినా వైద్యులనే తప్పుబడుతున్నారని తెలిపింది. అసోం కరోనా వార్డులో ఓ యువ వైద్యుడిపై జరిగిన దాడి విదితమే. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి.

ఎవరైనా అల్లోపతి, వ్యాక్సినేషన్ పై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. అంటు వ్యాధుల చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరింది. ఆపత్కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులు నిర్భయంగా పనిచేసుకునే హక్కు కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.