Begin typing your search above and press return to search.

రీల్ క‌థ‌ను త‌ల‌పించే అత‌డి 'రియ‌ల్' క‌థ‌!

By:  Tupaki Desk   |   4 July 2019 5:58 AM GMT
రీల్ క‌థ‌ను త‌ల‌పించే అత‌డి రియ‌ల్ క‌థ‌!
X
రీల్ క‌థ‌ను త‌ల‌పించే రియ‌ల్ క‌థ‌. ఇలా సాధ్య‌మేనా? అన్న సందేహం క‌లుగుతుంది.కానీ.. సాధ్య‌మే అన‌టానికి నిలువెత్తు మ‌నిషి క‌నిపిస్తాడు. క‌ర్ణాట‌క‌లోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన వ్య‌క్తి వ‌క్ర‌మార్గంలో న‌డిచి.. అన‌తికాలంలో కోట్లాది రూపాయిలు సంపాదించ‌ట‌మే కాదు.. ఇప్పుడు కేసుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప‌రిస్థితి. వేసే అడుగు స‌క్ర‌మంగా ఉంటే.. క‌థ మ‌రోలా ఉండేది. కానీ.. కాసుల క‌క్కుర్తితో అత‌గాడు చేసిన దందా తెలిసిన‌ప్పుడు రీల్ క‌థ చ‌దివిన‌ట్లుగా అనిపించ‌క‌మాన‌దు.

పూట గ‌డ‌వ‌టానికి కూడా దిక్కు లేని ప‌రిస్థితి ముజాహిదీన్ ది. క‌ర్ణాట‌క‌లోని భ‌ద్రావ‌తిలో క‌ర్చీఫ్ లు అమ్ముకొని బ‌తికేవాడు. మ‌రింత మెరుగైన జీవితం కోసం 2001-02లో బెంగ‌ళూరు న‌గ‌రానికి వ‌చ్చాడు. ఫ్రేజ‌ర్ టౌన్ వ‌ద్ద సెప్పింగ్ రోడ్డులో ఒక టీ షాపు స్టార్ట్ చేశాడు. అత‌డి వ‌ద్ద‌కు టీ తాగ‌టానికి వ‌చ్చే వారితో ప‌రిచ‌యాలు చేసుకునేవాడు. అత‌డి వ‌ద్ద‌కు టీ తాగేందుకు వ‌చ్చే వారిలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండేవారు.

వారిని ప‌రిచ‌యం చేసుకొని తాను రియ‌ల్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. అలా స్టార్ట్ అయిన ఆయ‌న రాజ‌కీయ నేత‌ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకున్నాడు. సంపాద‌న కూడా అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోయాడు. చివ‌ర‌కు 2010లో స్థానిక ఎన్నిక‌ల్లో జేడీఎస్ నుంచి పోటీ చేసి కార్పొరేట‌ర్ గా ఓడిపోయాడు.

అనంత‌రం ఐఎంఏ గ్రూపు అధినేత మ‌న్సూర్ ఖాన్ తో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఆయ‌న ద్వారా ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు.. వ్యాపారుల‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యాల‌తో ఐఎంఏ గ్రూపులో పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు చేయించేవారు. తాజాగా వేల కోట్లు ఎగ‌నామం పెట్టిన స్కాంను త‌వ్వి తీస్తున్న సిట్ అధికారుల‌కు ముజాహిదీన్ లీల‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం నామినేటెడ్ కార్పొరేట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న అత‌గాడి నేర చ‌రిత్ర గురించి చూసిన అధికారులు విస్మ‌యానికి గురి అవుతున్నారు.

ఒక సామాన్యుడు వ‌క్ర మార్గాన ప‌ట్టి.. అంచెలంచెలుగా ఎదిగిన క్ర‌మాన్ని విశ్లేషిస్తున్నారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్ర‌మంలో మోసాలు.. బ‌ల‌వంత‌పు వ‌సూళ్లు.. భూక‌బ్జా కేసులు అత‌నిపై న‌మోద‌య్యాయి. పుల‌కేశీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్లో ఇత‌డిపై రౌడీషీట్ కూడా తెరిచారు. చివ‌రికి ఇత‌గాడి య‌వ్వారం ఎంత ఎక్కువైందంటే.. పోలీస్ స్టేష‌న్లో పోలీసుల‌కే గ‌న్ను పెట్టే స్థాయికి వెళ్లిపోయాడు. దీంతో.. అత‌గాడ్ని జైల్లో వేశారు. పోలీసు కేసుల నుంచి బ‌య‌ట‌కొచ్చిన ఇత‌గాడు.. కేసుల నుంచి.. రౌడీ షీట్ నుంచి తెలివిగా బ‌య‌ట‌కొచ్చేశాడు. తాజాగా ఐఎంఏ స్కాం బ‌య‌ట‌కొచ్చిన త‌ర్వాత ఇత‌గాడి లీల‌ల్ని త‌వ్వుతున్న అధికారులు.. ఒక సామాన్యుడు ఇంత భారీగా ఆస్తులు సంపాదించిన వైనానికి షాక్ చెందుతున్న ప‌రిస్థితి.