Begin typing your search above and press return to search.

ఫిఫా ప్రపంచ కప్.. అందరి కళ్లూ ఆ ఫొటోపైనే. కోహ్లి సహా..

By:  Tupaki Desk   |   21 Nov 2022 5:30 PM GMT
ఫిఫా ప్రపంచ కప్.. అందరి కళ్లూ ఆ ఫొటోపైనే. కోహ్లి సహా..
X
ప్రపంచ సంగ్రామం అంటే ఎలా ఉంటుందో.. చాటుతూ ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ మ్యాచ్ ప్రారంభమైంది. అందరి కళ్లూ మ్యాచ్ లపైనే. అభిమాన ఆటగాళ్లు ఎలా ఆడతారనే..? అసలు విజేతగా ఎవరు నిలుస్తారో చెప్పలేని పరిస్థితి. మిగతా అన్ని క్రీడల్లో కంటే ఫుట్ బాల్ ప్రపంచ కప్ లోనే పోటీ ఎక్కువ. మిగతా ఆటల్లో ప్రపంచ కప్ లను ప్రపంచ కప్ లని పిలుస్తారు. ఫుట్ బాల్ లో మాత్రమే.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ అని అంటారు. దీన్నిబట్టే ప్రత్యేకత ఏమిటో చెప్పొచ్చు.

చిరకాల ప్రత్యర్థులు

ఏ క్రీడలోనైనా సమకాలీన అత్యుత్తమ ఆటగాళ్లు ఇద్దరు అంతకుమించి ఉంటారు. ఉదాహరణకు క్రికెట్ లో బ్రయాన్ లారా-సచిన్ టెండూల్కర్, టెన్నిస్ లో రోజర్ ఫెడరర్- రఫెల్ నాదల్ ఇలా. ఫుట్ బాల్ విషయానికొస్తే ప్రస్తుతం ఇలా చెప్పుకునే ఆటగాళ్లు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. అర్జెంటీనా మెరుపు వీరుడు లయోనల్ మెస్సీ. మైదానంలో వీరిద్దరూ తలపడ్డారంటే ఆ మజానే వేరు. అలా ఈసారీ వీరు తలపడ్డారు.. కానీ, ఫుట్ బాల్ మైదానంలో కాదు.

చదరంగ బోర్డుపై సమరం

ఈ ప్రపంచ కప్ లో అందరి కన్నూ ఈ ఇద్దరు దిగ్గజాలపైనే ఉంది. బహుశా ఇదే వీరికి చివరి ప్రపంచ కప్. తమ జట్లకు ఇంతవరకు ప్రపంచ కప్ అందించలేకపోయిన మెస్సీ.. ఓసారి మాత్రం ఫైనల్ కు చేర్చగలిగాడు. రొనాల్డో ఆ పనీ చేయలేకపోయాడు.

అందుకే ఈ సారి ఏంచేస్తారోనని వీరిద్దరి గురించి చర్చ సాగుతోంది. మరోవైపు వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు పెద్ద పండగే. వీరి జట్ల మధ్యే ఫైనల్‌ పోరు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్‌ ప్లేయర్లు కలిసి ఓ ఆట ఆడటం ప్రపంచ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ఎంత అద్భుత చిత్రమో..?

మెస్సీ, రొనాల్డొ సాధారణంగా మైదానంలో తలపడడమే కానీ.. బయట ఎక్కడా కలిసి కనిపించలేదు. ప్రత్యర్థులుగా వీరిద్దరూ తలపడడాన్ని చూసి.. నిజంగానే ప్రత్యర్థులు అని అనుకుంటారు. అలాంటిది ఫిఫా ప్రపంచ కఫ్‌ నేపథ్యంలో ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చెస్‌ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

క్రికెట్‌లో రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ కూడా ఆ ఫొటోపై స్పందించకుండా ఉండలేకపోయాడు. రొనాల్డో ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటో చూసి.. 'ఎంత అద్భుత చిత్రమో' అంటూ కామెంట్‌ చేశాడు. టీ20 ప్రపంచ కప్‌ తర్వాత కోహ్లీ ప్రస్తుతం ఆట నుంచి కాస్త విరామం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఖతార్‌ వేదికగా ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. బాణసంచా వెలుగులు, కళాకారుల విన్యాసాల మధ్య ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.