Begin typing your search above and press return to search.

పెళ్లి పేరుతో అమ్మాయిలే టార్గెట్‌..పాక్ క్రికెట‌ర్ చీక‌టి కోణం ర‌ట్టు!

By:  Tupaki Desk   |   25 July 2019 4:30 PM GMT
పెళ్లి పేరుతో అమ్మాయిలే టార్గెట్‌..పాక్ క్రికెట‌ర్ చీక‌టి కోణం ర‌ట్టు!
X
పాకిస్తానీ యువ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. సీనియర్ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్ మేనల్లుడు అయిన ఇమామ్ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఓపెనర్‌ గా కొనసాగుతున్నాడు. తాజా వరల్డ్‌ క‌ప్‌ లో సైతం ఇమామ్ పాక్‌ కు ఓపెనర్‌ గా సేవలు అందించాడు. ఇమామ్ పెళ్లి పేరు చెప్పి పలువురు యువతులను మోసం చేశాడ‌న్న ఆరోపణలు ఇప్పుడు పాకిస్తాన్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా ఏడుగురు యువతులతో అతడు చాటింగ్ చేసిన స్క్రీన్‌ షాట్లు ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

పాకిస్తాన్ జాతీయ మీడియా కథనాల ప్రకారం క్రికెటర్‌ గా తనకున్న పరపతిని వాడుకుని అనేక మంది యువతులను మోసం చేశాడని తెలుస్తోంది. పలువురు యువతులను ముగ్గులోకి దింపి ప్రేమిస్తున్నానని నమ్మించి... వారితో శారీరక అవసరాలు కూడా తీర్చుకున్నాడని కథనాలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆ యువ‌తులు పెళ్లి పేరు ఎత్తగానే వారిని బెదిరించి వదిలించుకుంటున్నాడ‌ని కూడా తెలుస్తోంది. గత ఏడెనిమిది నెలల్లో ఇమామ్ బాధిత యువతులు చాలామంది ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్లో సైతం ఇమామ్ యువతులతో ఈ తరహా సంబంధాలు కొనసాగించాడ‌ని కూడా సమాచారం.

ఇమామ్ ఈ యువతులతో సంబంధాలు కొనసాగించాడ‌న‌డానికి నిదర్శనంగా వాళ్లతో అతడు కొనసాగించిన చాటింగ్ విశేషాలు సైతం స్క్రీన్ షాట్ల రూపంలో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఆ స్క్రీన్ షాట్ లీక్ చేసిన ప్రొఫైల్ ఫేక్ అని అంటున్నారు. అమ్మాయి పేరుతో ఓ అబ్బాయి ఈ ప్రొఫైల్ నడిపిస్తున్నాడని వారు వాదిస్తున్నారు. ఇమామ్ అభిమానులు మాత్రం అత‌డు ప్రస్తుతం క్రికెట్ జట్టుకు ఓపెనర్‌ గా సేవలు అందిస్తున్నాడ‌ని.. అతడు ఫ్యూచ‌ర్‌ లో పాక్ టీంలో కీల‌కం కావ‌డంతో... అతడిపై బురదజల్లేందుకు ఈ పుకార్లు క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే ఇమామ్ చాటింగ్ చేసిన ఆధారాలు స్పష్టంగా ఉండడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని మ‌హిళా సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. పాక్‌ లో మహిళలను వేధిస్తే వారిపై చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ విషయంపై పాక్ క్రికెట్ బోర్డు స్పందించక పోయినా... ఇది నిజం అని తేలితే ఇమామ్‌ పై ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.