Begin typing your search above and press return to search.

అమెరికాలో కొత్త సోదాలు...టార్గెట్ వారే

By:  Tupaki Desk   |   14 July 2019 6:39 AM GMT
అమెరికాలో కొత్త సోదాలు...టార్గెట్ వారే
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌ర్కారు ఫ‌లితంగా మ‌రో క‌ల‌క‌లం చోటు చేసుకోనుంది. వీసాల జారీని కఠినతరం చేస్తున్న ట్రంప్...తాజాగా దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై దృష్టి సారించారు. వలసదారులను సమూలంగా దేశం నుంచి బహిష్కరించే చర్యలను వేగవంతం చేసే చ‌ర్య‌ల్లో భాగంగా ఇమిగ్రేష‌న్స్ ఆండ్ క‌స్టమ్స్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను త‌మ దేశం నుంచి పంపించివేసేందుకు సోదాలు మొద‌లుపెట్టింది. తొలి విడతగా పది ప్రధాన నగరాల్లో దాడులు జరుగుతాయని - అక్రమంగా ఉన్న వారిని ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ విభాగం (ఐసీఈ) స్ప‌ష్టం చేసింది.

ఓ అంచ‌నా ప్ర‌కారం అమెరికాలో దాదాపు కోటీ పది లక్షల మంది సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు పొరుగున ఉన్న మెక్సికో - గ్వాటెమాలా - హోండూరాసలకు చెందిన వారే! ఇందులో దాదాపు లక్ష మంది ఇండియన్-అమెరికన్‌ లు కూడా ఉంటారని అంచనా. గ‌త ఏడాది - అక్రమవలసదారులు దేశంలో ఏ మూల ఉన్నా.. ఉన్నపళాన అరెస్టు చేసేందుకు లేదా అదుపులోకి తీసుకునేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు సర్వాధికారాలు కట్టబెడుతూ డిపార్ట్‌ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ మెమో జారీ చేసింది. అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించేందుకు సుమారు 15వేల మంది ఇమ్మిగ్రేషన్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ ఏజెంట్లను కూడా నియమించింది. ఈ ఆదేశాల అమ‌లును కొద్దికాలం పాటు చూసి చూడ‌న‌ట్లుగా ఉన్న ట్రంప్ తాజాగా తగిన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న ప్రతిఒక్కరినీ ఏరి మరీ దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు.

2020లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో వ‌ల‌స‌లే ప్ర‌ధాన ఎజెండాగా మార‌నుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ట్వీట్ చేశారు. ``అమెరికాలో స‌రైన ప‌త్రాలు లేకుండా నివ‌సిస్తున్న మిలియ‌న్ల కొద్ది అమెరికా నుంచి వ‌చ్చే వారంలో పంపించి వేయ‌నున్నాం. వారిని త్వ‌రిత‌గ‌తిన పంపించేందుకు ఇమిగ్రేష‌న్స్ ఆండ్ క‌స్ట‌మ్స్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ ప‌నిచేయ‌నుంది.`` అని ట్వీట్ చేశారు. దానికి కొన‌సాగింపుగా తాజా సోదాలు మొద‌లుకానున్నాయి. అట్లాంటా - బాల్టిమోర్‌ - షికాగో - డెన్వర్‌ - హ్యూస్టన్‌ - లాస్‌ ఏంజెలిస్‌ - మియామీ - న్యూ ఆర్లియాన్స్‌ - న్యూయార్క్‌ నగరాల్లో దాడులు జరుగుతాయని తెలుస్తోంది. గడువు పూర్త‌యిన త‌ర్వాత‌ కూడా ఉంటే బలవంతంగా స్వదేశాలకు పంపేయడం - కేసులుంటే విచారణల నిమిత్తం నిర్బంధంలోకి తీసుకోవడం జరుగుతాయని తెలిపాయి.