Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో లుకలుకలు...సోనియాకు కొత్త చిక్కులు

By:  Tupaki Desk   |   25 Nov 2020 3:30 AM GMT
కాంగ్రెస్ లో లుకలుకలు...సోనియాకు కొత్త చిక్కులు
X
130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ....2014 సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలవడంతో పార్టీపై అసంతృప్తి ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకున్నారు. ఇక, 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడంతో అసలు పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అనుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఫల్యం తర్వాత పార్టీలో అంతర్గత లుకలుకలు బయటపడ్డాయి. ఎన్నికల్లో వరుస ఓటములు, పార్టీలో నాయకత్వ లేమి, కుటుంబ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, శశి థరూర్, కపిల్ సిబల్ వంటి నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే టైటానిక్ లా ఉందని, త్వరగా మేల్కొని సోనియా కళ్లుతెరవకుంటే మునక తప్పదని హెచ్చరించారు. ఇక, బిహార్ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ ఓటమికి కాంగ్రెస్ కారణమని విమర్శలు వస్తున్న తరుణంలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వ్యాఖ్యలు మరోసారి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరుకున పెట్టాయి.

గాంధీల నాయకత్వాన్ని ఓటర్లతో పాటు పార్టీలో అసమ్మతి వర్గం కూడా తిరస్కరిస్తోంది. రాహుల్ చరిష్మా తగ్గిందనడానికి బిహార్ ఎన్నికలు నిదర్శనమని ఆ వర్గం అంటోంది. ఇప్పటికైనా పార్టీలో ప్రతీ స్ధాయిలోనూ నేతలను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాలని అసమ్మతి నేతలు అంటున్నారు. పార్టీ మంచికే వారు చెప్పినా...అది అసమ్మతిలా, తిరుగుబాటులా కనిపిస్తోంది. ఆ తరహా ఎన్నికలకు రాహుల్, సోనియా సుముఖంగా లేరు. సోనియా నియమించిన కమిటీలు, ఆపరేషన్ ఫెయిల్ అయ్యాయి. దీంతో, అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడే పరిస్దితి ఉంటే రాహుల్‌ ఎన్నికలకు మొగ్గు చూపించకపోవచ్చు. అవసరమైతే పోటీపడాలనుకునే వారిని పార్టీ నుంచి సాగనంపవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ సోనియాకు, మిగతా నేతలకు వారధిలా ఉన్న అహ్మద్‌ పటేల్‌ అనారోగ్యం బారిన పడడంతోనే ఈ గ్యాప్ వచ్చిందని అంటున్నారు. బెంగాల్ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసిన కాంగ్రెస్...దీదీతో చేయికలిపేందుకు విఫలయత్నం చేస్తున్నారు. 20 మంది ఎంపీలున్న తృణముల్ తో కలిస్తే పార్లమెంటులో బీజేపీని కొంతవరుకు ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. మరి, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో పునరుత్తేజం కలిగించి అసమ్మతి చల్లార్చేందుకు సోనియా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.