Begin typing your search above and press return to search.

లేటెస్ట్; తెలుసుకోవాల్సిన విషయాలు

By:  Tupaki Desk   |   16 Oct 2015 11:30 AM GMT
లేటెస్ట్; తెలుసుకోవాల్సిన విషయాలు
X
కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి అప్ డేట్స్ చాలా ముఖ్యం. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినఅవసరం ఎంతైనా ఉంది. అలాంటి అప్ డేట్స్ తో లేటెస్ట్ గా కొన్ని చోటు చేసుకున్నాయి. అలాంటి వాటిని చూస్తే..

1. బీబీసీ.. ఉబెర్.. నెట్ ఫ్లిక్స్.. ద ఎకనామిస్ట్.. లాంటి ప్రముఖ వెబ్ సైట్లు దాదాపు రెండు డజన్ల వరకు క్రాష్ కావటం సంచలనంగా మారింది. క్లౌడ్ కంప్యూటింగ్ లో చోటు చేసుకున్నసాంకేతిక సమస్యలే సైట్లు క్రాష్ కావటానికి కారణంగా చెబుతున్నారు. ఈ సాంకేతిక సమస్యల కారణంగా.. సదరు సైట్లకు సంబంధించి మొబైల్.. ల్యాప్ టాప్.. డెస్క్ టాప్.. టాబ్లెట్.. ఇలా అన్నీ రకాల డివైజ్ లోనూ సమస్యలు చోటు చేసుకున్నాయి. సైట్లు క్రాష్ కావటానికి కారణాల్ని సదరు సంస్థలు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు.. దీనిపై సోషల్ మీడియాలో మాత్రం కుట్ర పూరిత అంశాలే కారణంగా వాదనలు వినిపిస్తున్నాయి.

2. ఫేస్ బుక్ నుంచి మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఏదైనా బ్రేకింగ్ కు సంబంధించిన విషయాల్ని నోటిఫికేషన్ల రూపంలో ఫేస్ బుక్ ఇకపై ఇవ్వనుంది. ఇప్పటివరకూ ఫేస్ బుక్ ఆఫ్ లైన్ లో ఉన్నప్పటికీ మన ఖాతాకు సంబంధించి నోటిఫికేషన్లు రావటం మామూలే. అదే రీతిలో.. బ్రేకింగ్ న్యూస్ కు సంబంధించిన అంశాల్ని కూడా నోటిఫికేషన్ల రూపంలో ఇవ్వనుంది. అయితే. ఈ నోటిపికేషన్లు ఫేస్ బుక్ నేరుగా ఇవ్వదని.. వివిధ మీడియా సంస్థలు ఇచ్చే నోటిఫికేషన్లను ఫేస్ బుక్ పంపుతుందని.. దాన్ని ఓపెన్ చేస్తే.. సదరు మీడియా సంస్థల వెబ్ సైట్లు రీ డైరెక్ట్ కానున్నాయి. ఈ నెలాఖరులోపు ఈ సేవల్ని అందించనున్నట్లు తెలుస్తోంది.

3. రక్షణ రంగ ఎగుమతులకు సంబంధించి భారత్ కు భారీ దెబ్బ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆక్వెడార్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. 2009 నుంచి2012 మధ్యలో ఏడు ధ్రువ్ చాఫ్టర్లను సరఫరా చేస్తే ఇందులో నాలుగు కూలిపోయాయి. దీంతో.. ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య భారత్ ఎగుమతుల మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

4. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కాల్ డ్రాప్ కావటం చాలామందికి అనుభవమే. ఇకపై.. అలాంటి సమస్యలు ఎదురైన ప్రతిసారీ పరిహారంగా రూపాయి చొప్పున వినియోగదారుడికి ఇవ్వాల్సిందేనని ట్రాయ్ అభిప్రాయపడింది. మరి.. ట్రాయ్ మాటను టెలికం ఆపరేటర్లు ఎంతమేరకు అమలు చేస్తారో చూడాలి. కాల్ డ్రాప్ సమస్యకు కారణం పరిమితికి మించి కనెక్షన్లు ఇవ్వటమేనని ట్రాయ్ చెబుతోంది.

5. కేంద్ర సర్కారు అమలు చేస్తున్న విధానాల్ని విభేదిస్తూ పలువురు సాహిత్యకారులు ప్రభుత్వం గతంలో తమకిచ్చిన పురస్కారాల్ని వెనక్కి ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో తెలుగు రచయిత చేరారు. 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన ఎం.భూపాల్ రెడ్డి తనకిచ్చిన పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.