Begin typing your search above and press return to search.

తెలుసుకోవాల్సినవి.. అప్ డేట్ కావాల్సినవి..?

By:  Tupaki Desk   |   16 Dec 2015 4:14 AM GMT
తెలుసుకోవాల్సినవి.. అప్ డేట్ కావాల్సినవి..?
X
ఇప్పుడున్న డిజిటల్ యుగంలో తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని తప్పనిసరి.. మరికొన్ని అంశాల్లో అప్ డేట్ అవసరం. కొన్ని అంశాలు తెలుసుకోవటం దైనందిక జీవితానికి చాలా లాభం కలుగుతుంది. అలాంటి సమాచారంలోకి వెళితే..

= ప్రముఖ బ్యాకింగ్ సంస్థ ఎస్ బీఐకు చెందిన ఆన్ లైన్ వెబ్ సైట్ లో చెల్లింపులు చేయాలని ప్రయత్నిస్తున్న ఎందరికో గత మూడు రోజులుగా చుక్కలుకనిపిస్తున్నాయి. వివిధ బిల్లుల చెల్లింపులతో పాటు.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు డిసెంబరు 15 చివరి తేదీ కావటంతో.. ఈ వెట్ సైట్ ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేయాలని భావించిన వారికి ‘సినిమా’ కనిపించింది. ఎంతసేపటికి సైట్ స్పందించకపోవటం.. పని చేయకపోవటం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. చివర్లో చెల్లింపులు జరపాలనుకునే చాలామందికి ఎస్ బీఐలో చోటు చేసుకున్న సాంకేతిక లోపం.. వినియోగదారులకు చుక్కలు చూపించింది.

= అమెరికా లాంటి అగ్రరాజ్యం.. సాంకేతికంగా ఎంత సౌండో తెలిసిందే. అయితే.. ఈ దేశం 360 మిలియన్ డాలర్లతో తయారు చేసిన యూఎస్ ఎస్ మిల్ వాకీ అనే యుద్దనౌకను గత నెలలో (నవంబరు 21న) జలప్రవేశం చేశారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ జలనౌక.. సముద్రంలో రంగప్రవేశం చేసిన నెలలోపే సాంకేతిక సమస్య వచ్చి తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఆగిపోయింది. దీంతో.. దాన్ని రిపేర్ చేసేందుకు తీరానికి లాక్కొచ్చారు. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి తయారు చేసిన యుద్ధనౌక మూడు వారాలకే మూలపడటం ఇప్పుడు చర్చగా మారింది.

= ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ ‘స్నాప్ డీల్’ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థకు చెందిన తెలుగు యాప్ ను త్వరలో విడుదల చేయనున్నారు. యాప్ ఇంటర్ ఫేస్ ని మార్చటంతో పాటు.. హిందీ.. తెలుగు బాషల్లో జనవరి 26 నుంచి సేవలు అందించనున్నారు. అనంతరం తమిళం.. పంజాబీ.. మరాఠీ.. బెంగాలీ.. కన్నడం.. మలయాళం.. ఒరియా.. కన్నడ తదితర భాషల్లో అందుబాటులోకి తేనున్నారు. అయితే.. ఇన్ని భాషల సౌకర్యం కేవలం మొబైల్ యాప్ కు మాత్రమే పరిమితం. వెబ్ సైట్ మాత్రం ఇప్పటి మాదిరే కొనసాగించనున్నారు.

= చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసి.. లక్షలాది మందిని నష్టపర్చిన భారీ వర్షాలు.. వరదల్లోనష్టపోయిన వారికి సంబంధించి ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్ జీ సర్వీస్ క్యాంప్ ప్రారంభించింది. ఎలాంటి రుసుం చెల్లించకుండానే పాడైన వస్తువులకు సంబంధించి స్పేర్స్ (విడి భాగాలు) అమర్చనున్నారు. దీనికి సంబంధించి 50 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు ఎల్ జీ పేర్కొంటోంది. తమ వంతు సాయంగా ఈ ఉచిత క్యాంప్ ను ఎల్ జీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

= ప్రపంచానికి వార్తలు అందించే జర్నలిస్టుల బతుకులు ఎంత దారుణంగా మారాయన్నది ఇరాక్ లో పని చేసే జర్నలిస్టుల సంగతి చూస్తే తెలుస్తుంది. 2015 ఒక్క ఏడాదిలో ఇరాక్ లో 29 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వీరిలో 20 మంది ఐఎస్ తీవ్రవాదులే హతమార్చటం గమనార్హం. ఐఎస్ వ్యతిరేక పోరాటాల్నికవర్ చేస్తున్న ముగ్గురితో సహా.. పలువురు జర్నలిస్టులను కిడ్నాప్ చేసి.. అనంతరం చంపేశారు. ఇరాక్ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకున్న నాటి నుంచి ఇప్పటివరకూ 435 మంది జర్నలిస్టులు ఇరాక్ లో హత్యకు గురయ్యారు. కేవలం పన్నెండేళ్ల వ్యవధిలో ఇంతమంది జర్నలిస్టులు ఒక దేశంలో హత్యకు గురి కావటం గమనార్హం.

= రెండు రోజుల పర్యటనలో భాగంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బుధవారం భారత్ కు వచ్చేస్తున్నారు. తొలుత కంపెనీ ఉద్యోగులతో సమావేశం అయ్యాక.. మంత్రులతో భేటీ అవుతారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్.. ప్రధాని మోడీలతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ లోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ లో విద్యార్థులతో మాట్లాడనున్నారు. ప్రవాసాంధ్రుడైన పిచాయ్.. గూగుల్ సీఈవో అయ్యాక చేస్తున్న భారత పర్యటన ఇదే.