Begin typing your search above and press return to search.

తెలుసుకోవాల్సినవి.. ఇంపార్టెంట్ అప్ డేట్స్

By:  Tupaki Desk   |   27 Jan 2016 11:30 AM GMT
తెలుసుకోవాల్సినవి.. ఇంపార్టెంట్ అప్ డేట్స్
X
మన చుట్టూ చాలానే జరిగిపోతుంటాయి. చాలావాటితో మనకు సంబంధం ఉండదు. ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారం తెలీకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ.. కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించిన అంశాల మీద అప్ డేట్ కాకుండా చాలానే ఇబ్బంది. అలాంటివి ఎదురుకాకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తెలుసుకోవాల్సిందే. అదే సమయంలో.. మనకు అవసరం లేకున్నా.. సరికొత్త మార్పులకు సంబంధించిన అంశాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటి విషయంలోకి వెళితే..

= వాహనాలు నడిపే విషయానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే.. చూసీ చూడనట్లుగా చాలావరకు నడిచిపోతుంది. అయితే.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదనే చెప్పాలి. రోడ్డు ప్రమాదాలకు చెక్ చెప్పేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కఠినంగా వ్యవహరించింది. త్వరలో అమల్లోకి రానున్న నిబంధన ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా పట్టుబడితే.. వారికి గతంలో మాదిరి జరిమానా విధించి వదిలేయరు. ఎవరైనా మూడుసార్లకు మించి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వారిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి.. మూడు నెలలు జైలుశిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నారు. మైనర్లకు కూడా మినహాయింపు ఇవ్వకూడదన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. అందుకే.. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది. లేకుంటే.. జైలుకు వెళ్లాల్సి ఉంటుంది సుమా.

= దృష్టి లోపం ఉన్న వారు రైల్లో ప్రయాణించే సమయంలో చాలానే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం దేశంలో మొదటిసారి ఒక ప్రత్యేక రైలును సిద్ధం చేశారు. మైసూరు – వారణాసి మధ్య వారానికి రెండుసార్లు నడిచే ఈ ట్రైన్ లో దృష్టి లోపం ఉండే వారికి ఇబ్బందులు కలగకుండా కోచ్ లోని బెర్త్ లు.. అలారప్ గొలుసులు.. టాయిలెట్స్.. అత్యవసర ద్వారాలు లాంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని బ్రెయిలీ లిపిలో ఏర్పాటు చేశారు.

= సంగీత ప్రియులకు శుభవార్త. తాజాగా ‘‘రాగం’’ అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రసార భారతికి చెందిన ఈ యాప్ ను బెంగళూరు ఆకాశవాణి కార్యక్రమాల్ని ప్రసారం చేస్తుంది. శాస్త్రీయ సంగీత దిగ్గజాలతో పాటు.. వర్థమాన కళాకారులు రూపొందించిన సంగీత స్వరాల్ని.. తాజా కార్యక్రమాల్ని ప్రసారం చేస్తారు. 24 గంటలూ సంగీతాన్ని అందించే ఈ రాగం సరికొత్త అనుభూతి ఇవ్వటం ఖాయమంటున్నారు.

= తల్లిదండ్రులను సంప్రదించకుండా విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అందించొచ్చా? అంటే ఎలా అని ప్రశ్నిస్తాం. కానీ.. ఇప్పటివరకూ ఉన్న విధానంలో అలాంటి సమాచారం కోరిన వెంటనే ఇచ్చేసేవారు. తాజాగా అలాంటి పద్ధతికి స్వస్తి పలకాలని పేర్కొంటూ స్కూళ్లకు కేంద్ర సమాచార కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. ఏ విద్యార్థికి సంబంధించిన సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు తెలీకుండా ఇవ్వకూడదని నిర్ణయించారు.