Begin typing your search above and press return to search.

ఆ పార్టీ అధ్య‌క్షుడికి ఆ పాడు బుద్ది ఉంద‌ట‌

By:  Tupaki Desk   |   3 Aug 2017 4:23 AM GMT
ఆ పార్టీ అధ్య‌క్షుడికి ఆ పాడు బుద్ది ఉంద‌ట‌
X
పాకిస్థాన్ ప్ర‌తిప‌క్ష అధినేత‌.. పీటీఐ అధ్య‌క్షుడు క‌మ్ ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ పై ఆయ‌న పార్టీకి చెందిన బ‌హిష్కృత మ‌హిళా స‌భ్యురాలు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇమ్రాన్ ఖాన్ త‌నకు ఆయ‌న‌ ఫోన్ నుంచి అస‌భ్య‌క‌ర సందేశాలు పంపిన‌ట్లుగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి మ‌రీ ఆమె చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. విప‌క్ష నేత చిక్కుల్లో ప‌డిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై విచార‌ణ జ‌ర‌పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. పార్టీకి తాను రాజీనామా చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. త‌న‌కు పార్టీ టికెట్ రావాల‌ని లేద‌ని.. ఎన్ ఏ 1 సీటును సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న లేద‌న్నారు.

ఎన్ ఏ1 సీటుకు.. తాను రాజీనామా చేయ‌టానికి సంబంధం లేద‌న్న ఆమె.. ప్ర‌స్తుతం మాన‌సికంగా కుంగుబాటుకు గురి కావ‌టంతో తానీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. పార్టీలో చాలా స‌మ‌స్యలు ఉన్నా.. ఫోన్ నుంచి అస‌భ్య‌క‌ర మెసేజ్ లు పంప‌టం వారికున్న మ‌రో చెడ్డ అల‌వాటుగా ఆమె అభివ‌ర్ణించారు. తాను 2013 అక్టోబ‌రులో ఇమ్రాన్ ఫోన్ నుంచి అస‌భ్య‌క‌ర మెసేజ్‌ ను తాను అందుకున్న‌ట్లుగా చెప్పారు. కావాలంటే ఇమ్రాన్ ఖాన్ బ్లాక్ బెర్రీ ఫోన్ ను చెక్ చేయాల‌న్నారు.

బ్లాక్ బెర్రీ ఫోన్ల‌లో మెసేజ్‌ ల‌ను క‌నిపెట్టే సౌక‌ర్యం ఉండ‌ద‌ని.. అందుకే పార్టీలోని మ‌హిళా నేత‌లంతా ఆ ఫోన్ల‌నే వాడాల‌ని ఇమ్రాన్ సూచించేవార‌న్నారు. గౌర‌వంతో జీవించే ఏ వ్య‌క్తి ఆ త‌ర‌హా మెసేజ్‌ ల‌ను అంగీక‌రించ‌లేర‌న్న ఆమె.. ఇమ్రాన్ ఖాన్ త‌న‌ను తాను ఎంత‌మాత్రం కంట్రోల్ చేసుకోలేర‌న్నారు. పార్టీలోని ప‌లువురు మ‌హిళ‌లు ఇలాంటి ప‌రిస్థితుల్నే ఎదుర్కొంటున్న‌ట్లుగా ఆమె వెల్ల‌డించారు. ఇమ్రాన్ మాన‌సిక ప‌రిస్థితి మీదా ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. పీటీఐలో చురుగ్గా ఉండే గులాలై చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. దీనిపై ఇమ్రాన్ స్పందించాల్సి ఉంది.