Begin typing your search above and press return to search.

ఇక‌.. పాక్ సుల్తాన్ ఇమ్రాన్ ఖాన్!

By:  Tupaki Desk   |   26 July 2018 4:46 AM GMT
ఇక‌.. పాక్ సుల్తాన్ ఇమ్రాన్ ఖాన్!
X
పాకిస్థాన్ క్రికెట‌ర్ గా సుప్ర‌సిద్ధుడు.. వ‌రుస ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలై.. త‌న అదృష్టాన్ని మ‌రోసారి ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నం చేసిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (షార్ట్ క‌ట్ లో పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించే దిశ‌గా దూసుకెళుతున్నారు. అయితే.. అధికారాన్ని చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన మెజార్టీ మాత్రం మిస్ కావ‌టం గ‌మ‌నార్హం.

పాకిస్థాన్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ బుధ‌వారం జ‌రిగింది. పోలింగ్ గ‌డువు పూర్తి అయిన వెంట‌నే.. ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఎన్నిక‌లు జ‌రిగిన 272 సీట్ల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం 114 సీట్ల‌లో అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ - ముస్లింలీగ్ 55 సీట్ల‌తో రెండో స్థానంలో నిలిచింది. మ‌రో పార్టీ అయిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 32 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉంది. పూర్తి ఫ‌లితాలు ఇంకా వెలువ‌డ‌లేదు. విజేత‌ల‌ను అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇమ్రాన్ ఖాన్ మొత్తం ఐదు స్థానాల్లో పోటీ చేయ‌గా.. అన్ని చోట్ల ఆయ‌న గెలుపొందారు. జైలుపాలైన మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ సోద‌రుడు పార్టీని న‌డిపిస్తున్నారు. ఆయ‌న కూడా ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా సాగుతున్నారు. మ‌రో మాజీ ప్ర‌ధాని భేన‌జీర్ భుట్టో భ‌ర్త ఆసిఫ్ జ‌ర్దారీ.. కుమారుడు బిలావ‌ల్ భుట్టో కూడా విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తున్నారు.

పాకిస్థాన్ లో మొత్తం సీట్లు 342 కాగా.. ఇందులో 60 సీట్ల‌ను మ‌హిళ‌ల‌కు.. 10 సీట్ల‌ను మైనార్టీల‌కు కేటాయించారు. అంటే.. మొత్తం స్థానాల్లో 70 స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌వు. మిగిలిన 272 సీట్ల‌లో ఎవ‌రు అత్య‌ధిక స్థానాలు కైవ‌శం చేసుకుంటే వారికి అధికారం ద‌ఖ‌లు ప‌డుతుంది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన మేజిక్ సీట్లు 137 కాగా.. ఇమ్రాన్ పార్టీ 114 స్థానాల్ని గెలుచుకుంది. అంటే.. మేజిక్ ఫిగ‌ర్ కు అవ‌స‌ర‌మైన స్థానాల‌కు 23 సీట్లు త‌గ్గిన‌ట్లు. ఈ నేప‌థ్యంలో ఏ పార్టీతో ఆయ‌న జ‌త క‌డ‌తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇప్పుడు వినిపిస్తున్న అంచ‌నాల‌ ప్ర‌కారం ప్ర‌భుత్వ ఏర్పాటులో పీపీపీ కింగ్ మేక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుందంటున్నారు. అధికారం ఎక్క‌డ ఉంటే.. అటువైపు మొగ్గు ప్ర‌ద‌ర్శిస్తార‌న్న పేరున్న వివాదాస్ప‌ద ఎంఎంఏ పార్టీ నేత ఫ‌జ్లుర్ రెహ్మాన్ పార్టీకి కూడా దాదాపు 15 సీట్లు వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఉగ్ర‌వాద సంస్థ తెహ్రీక్ -ఎ-తాలిబాన్ పాకిస్థాన్ కు అనుకూలుడైన ఫ్ల‌జ‌ర్ సాయాన్ని ఇమ్రాన్ తీసుకుంటార‌ని చెబుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 3570 మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు. పాక్ ఆర్మీ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తే.. వారికి విజ‌యం ప‌క్కా అన్న‌నానుడిని నిజం చేస్తూ.. ఈసారి ఇమ్రాన్ పార్టీకి ద‌న్నుగా నిల‌వ‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి పాక్ ఆర్మీ మ‌రోసారి త‌న అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.