Begin typing your search above and press return to search.

ఇమ్రాన్‌..ఇంకో షాకింగ్ ఆర్డ‌ర్‌

By:  Tupaki Desk   |   25 Aug 2018 12:12 PM GMT
ఇమ్రాన్‌..ఇంకో షాకింగ్ ఆర్డ‌ర్‌
X
పాకిస్థాన్ 22వ ప్రధాన మంత్రిగా పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికయిన సంగ‌తి తెలిసిందే. నేషనల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌ లో ఖాన్‌ కు 176 ఓట్లు రాగా - పీఎంఎల్ ఎన్ పార్టీకి చెందిన షాబాజ్ షరీఫ్‌ కు 96 ఓట్లు వచ్చాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప‌గ్గాలు చేప‌ట్టారు. ఇలా ఇప్పుడిప్పుడే పాలనలో ఓనమాలు నేర్చుకుంటున్న పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. 524 మంది సిబ్బంది - భారీ వ్యయాల నేపథ్యంలో తాను ప్రధానమంత్రి నివాసంలో ఉండబోనని ఇమ్రాన్‌ ఖాన్ ప్రకటించారు. మూడు పడక గదులు మాత్రమే ఉన్న తన మిలిటరీ కార్యదర్శి ఇంటికి సోమవారం మారారు. తనకు కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే చాలన్నారు. భారీ అప్పులు - ఆర్థికలోటు నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలను తగ్గిస్తానన్న ఇమ్రాన్.. విలాసవంతమైన ప్రధాని నివాసంలో ఉండటానికి నిరాకరించారు.

దీని అనంత‌రం ఆయ‌న దేశపెద్దలకు షాక్ ట్రీట్‌ మెంట్ ఇచ్చారు. అధ్యక్షుడు - ప్రధానితో సహా ప్రభుత్వ పెద్దలెవరూ ఇకనుంచి విమానాల్లో మొదటి తరగతిలో ప్రయాణించరాదని నిర్ణయించారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారమంత్రి ఫవాద్ చౌదరి చెప్పారు. అంతేకాకుండా ప్రధాని మొదలుకొని ఎంపీల దాకా సొంత వివేచన మేరకు ఖర్చుచేసే నిధులపై కూడా నిషేధం విధించినట్టు ఆయన చెప్పారు. విదేశీ పర్యటనలకు ప్రత్యేక విమానాలు ఉపయోగించడం మానేయాలని, బిజినెస్ క్లాస్‌ లో వెళ్లాలని కూడా పాక్ ప్రధాని నిర్ణయించుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణ‌యంపై పాక్ పాలకవర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.