Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వ కార్ల‌ను అమ్మ‌కానికి పెట్టిన పాక్ ప్ర‌ధాని!

By:  Tupaki Desk   |   18 Sep 2018 5:18 AM GMT
ప్ర‌భుత్వ కార్ల‌ను అమ్మ‌కానికి పెట్టిన పాక్ ప్ర‌ధాని!
X
మాటంటే మాటే. ఏదో మాట వ‌ర‌స‌కు డాబు త‌గ్గించేసి.. లోలోపల విలాసాల‌ను అనుభ‌వించే బ్యాచ్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు మాజీ క్రికెట‌ర్‌.. ప్ర‌స్తుత పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌.. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల విష‌యంలో చాలా నిక్క‌చ్చిగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. తాను ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుక్ష‌ణ‌మే.. త‌న‌కు ల‌భించే విలాసాల‌కు చెక్ చెప్పేసిన ఆయ‌న‌.. ఖ‌ర్చుల నియంత్ర‌ణ కోసం క‌ఠిన నిర్ణ‌యాల్ని తీసుకుంటున్నారు.

తాజాగా ప్ర‌భుత్వానికి చెందిన 102 ల‌గ్జ‌రీ కార్ల‌ను అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. తొలి ప్ర‌య‌త్నంలో 34 కార్ల‌ను అమ్మేశారు. వీటిల్లో కొన్ని బుల్లెట్ ఫ్రూప్ కార్లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

తొలిద‌శ‌లో నాన్ ఇంపోర్టెడ్ కార్లు (14) అమ్మారు. రెండో ద‌శ‌లో విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న 41 కార్ల‌ను వేలం వేయ‌నున్నారు. వీటిల్లో బెంజ్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ బీఎండబ్ల్యూ.. ట‌యోటా.. లెక్స‌స్‌.. సుజుకీ.. హోండా కార్లు.. జీపులు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ విలాస‌వంత‌మైన కార్ల‌తో పాటు.. ఉప‌యోగించ‌ని నాలుగు హెలికాఫ్ట‌ర్ల‌ను కూడా అమ్మ‌కానికి పెట్టారు.

కార్ల అమ్మ‌కం సంగ‌తి ఎలా ఉన్నా స‌రే.. పాక్ ఆర్థిక ప‌రిస్థితిని ఒక కొలిక్కి తీసుకురావాల‌న్న త‌ప‌న ఇమ్రాన్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తున్న‌ట్లు చెబుతున్నారు. తాను ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన క్ష‌ణం నుంచి ప్ర‌భుత్వ ఖ‌ర్చుల‌కు క‌ళ్లెం వేయ‌టం..అద‌న‌పు సిబ్బందిని త‌గ్గించ‌టంపైనే దృష్టి పెట్టారు.

తాను పొదుపు చ‌ర్య‌ల్ని పాటించిన‌ట్లే.. కీల‌క అధికారులు.. అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వారిని సైతం పొదుపుబాట ప‌ట్టాల‌న్న ఆదేశాల్ని జారీ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ జాబితాలో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి.. అధ్యక్షుడు.. ప్ర‌ధాని.. స్పీక‌ర్‌.. రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో స‌హా వీవీఐపీలంతా బిజినెస్ క్లాస్ లోనే ప్ర‌యాణించాల‌న్న ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి పొదుపు చ‌ర్య‌ల పుణ్య‌మా అని వృధా ఖ‌ర్చుకు చెక్ ప‌డింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.