Begin typing your search above and press return to search.

కశ్మీర్ కోసం అణుయుద్ధానికి సిద్ధమన్న ఇమ్రాన్

By:  Tupaki Desk   |   27 Aug 2019 4:56 AM GMT
కశ్మీర్ కోసం అణుయుద్ధానికి సిద్ధమన్న ఇమ్రాన్
X
పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుంది? అదెప్పుడు ఎవరి మీద పడుతుందో తెలీదు. మానవాళిని అంతం చేసే అణు బాంబును వినియోగిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయన్న విషయం రెండో ప్రపంచ యుద్ధంలో చూసిందే. విలయం అనే మాట చిన్నదిగా ఉండే అణుబాంబు ప్రయోగం ఎప్పటికి మరే దేశం వాడకూడదని కోరుకునే ప్రపంచ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా దుర్మార్గమైన వ్యాఖ్యల్ని చేస్తున్నారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కశ్మీర్ కోసం అవసరమైతే భారత్ తో అణుయుద్ధం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన దుర్మార్గమైన ప్రకటన చేశారు.

జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కరు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో తమ దేశ ప్రజల్ని ఉద్దేశించి ఇమ్రాన్ చేసిన ప్రసంగం చూస్తే.. పాక్ చేతిలో అణు బాంబు ఉండటం ఎంత ప్రమాదకరమన్న విషయం ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది. త్వరలో ఒక విధానం ప్రకటిస్తానని చెప్పిన ఇమ్రాన్.. పాక్ లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత శాంతిని కోరుకున్నట్లుగా చెప్పారు. ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలని భావించినట్లుగా నీతి కబుర్లు చెప్పిన ఆయన.. భారత్ కూడా ఇదే తరహా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

పోరుగు దేశంతో తాము స్నేహం కోరుకుంటున్నట్లుగా నీతులు చెప్పిన ఇమ్రాన్.. ఉగ్రవాదం పేరుతో భారత్ కుంటిసాకులు చెబుతుందన్నారు. భారత్ ఒక అడుగు ముందుకు వేస్తే.. తాము రెండడుగులు ముందుకు వేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చర్చలతోనే అన్న ఆయన.. ఈ అంశంపై తాము మాట్లాడాలని భావించిన ప్రతిసారీ ఉగ్రవాదం పేరుతో కుంటిసాకులు చెబుతోందన్నారు.

భారత్ లో ఎన్నికల వేళలో పాక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో తామే ఒక అడుగు వెనక్కు తగ్గినట్లుగా ఇమ్రాన్ పేర్కొన్నారు. పుల్వామా మీద ఆధారాలు ఉంటే.. తమకు అందిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కల్లబొల్లి కబుర్లు చెప్పారు. గతంలో కసబ్ విషయంలో చూపించిన ఆధారాలకు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోని పాక్.. ఇప్పుడు మాత్రం తానేదో చేస్తానని చెప్పటం గమనార్హం. పుల్వామా దాడులు పాక్ చేయించిందన్న ఆరోపణలకు సాక్ష్యాలు చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

భారత్ లో ఎన్నికలు రావటంతో తాము సైలెంట్ గా ఉన్నామని.. తిరిగి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు పాకిస్థాన్ కు ఎలాంటి ఆర్థిక సాయం అందకుండా చేయటానికి ప్రయత్నించటాన్ని తప్పు పట్టారు. జమ్ముకశ్మీర్ మీద ఆగస్టు 5న మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పు చేశారన్నారు. మోడీ సర్కారు చేసిన తప్పుతో కశ్మీర్ కు స్వతంత్రం రాబోతుందన్నారు. మోడీ ఏకపక్ష ధోరణి.. అహంకారం ఈ దెబ్బతో దిగిపోతాయన్న ఇమ్రాన్.. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లటంలో సక్సెస్ అయినట్లుగా పేర్కొన్నారు. 1965 తర్వాత తొలిసారి ఐక్యరాజ్యసమితి కశ్మీర్ పై సమావేశం ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన ఇమ్రాన్.. ఆ సమావేశం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవటమే కాదు.. చివరకు పాక్ ప్రతినిధి మీడియాకు ముఖం చాటేస్తూ.. హోటల్ వెనుక వైపు నుంచి వెళ్లిపోయిన వైనాన్ని మాత్రం ఇమ్రాన్ ప్రస్తావించలేదు. అణుయుద్ధానికైనా సిద్ధమంటూ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్య చేయటం ద్వారా పాక్ ప్రధాని ఆలోచనాస్థాయి ఏ మేరకు ఉంటుందన్న విషయాన్ని ఇమ్రాన్ తన తాజా ప్రసంగంతో చెప్పేశారని చెప్పాలి.