Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ పిలుపుతో దాయాది దేశంలో హైటెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   29 Oct 2016 11:28 AM GMT
ఇమ్రాన్ పిలుపుతో దాయాది దేశంలో హైటెన్ష‌న్‌
X
పాకిస్థాన్‌లో ఇప్పుడు హైటెన్ష‌న్ చోటు చేసుకుంది. అది భార‌త్ మ‌రోసారి స‌ర్జిక‌ల్ దాడుల‌తో విరుచుకుప‌డుతుంద‌నే వార్త‌ల‌తో కాదు! పాకిస్థాన్‌ లో ప్ర‌ధాని విప‌క్షం పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఇచ్చిన ఇస్లామాబాద్ దిగ్బంధం పిలుపుతో!! ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ పై ఇన్సాఫ్ పార్టీ అధినేత‌ - ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరుగుతున్న విష‌యం తెలిసిందే. న‌వాజ్ ఆయ‌న కుటుంబం దేశాన్ని దోచేస్తోంద‌ని, హ‌వాలా మార్గంలో దేశంలోని నిధుల‌ను విదేశాల‌కు త‌ర‌లించి వ్యాపారాలు చేస్తోంద‌ని, పెట్టుబ‌డులు పెడుతోంద‌ని గ‌త కొన్నాళ్లుగా ఇమ్రాన్ ఆరోపిస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌నామా పేప‌ర్స్ లీక్‌ తో మ‌రింత రెచ్చిపోయాడు.

దీంతో న‌వాజ్ త‌న ప్ర‌ధాని ప‌ద‌వికి స్వ‌చ్ఛందంగా రాజీనామా చేయాల‌ని ఇమ్రాన్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే న‌వంబ‌రు 2న పాక్ దేశ రాజ‌ధాని ఇస్లామాబాద్‌ ను దిగ్బంధించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. త‌మ పార్టీ మొత్తం క‌దిలి వ‌చ్చి 24 గంట‌ల‌పాటు ఇస్లామాబాద్‌ ని స్తంభింపచేస్తామ‌ని, ఫ‌లితంగా న‌వాజ్ ప‌రువు అంత‌ర్జాతీయంగా కూడా దిగ‌జారుతుంద‌ని, అప్పుడైనా ఆయ‌న కుటుంబానికి బుద్ధి వ‌స్తుంద‌ని ఇటీవ‌ల కాలంలో ప‌దే ప‌దే చెప్పిన ఇమ్రాన్‌.. అనుకున్న‌దే ఆల‌స్యంగా న‌వాజ్‌ పై భేరీ మోగించేందుకు రెడీ అయ్యారు. ఇమ్రాన్ పిలుపుతో దేశంలోని న‌లుమూల‌ల నుంచి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి రానున్నారు.

అయితే, ఇమ్రాన్‌ పై నిప్పులు చెరుగుతున్న ప్ర‌ధాని న‌వాజ్‌.. ఇమ్రాన్‌ ను ఆయ‌న ఉద్య‌మాన్ని అణిచి వేయాల‌ని ప‌రోక్షంగా అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇస్లామాబాద్ దిగ్బంధానికి మూడు రోజుల ముందే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ను గృహ నిర్బంధం చేశారు. అయిన‌ప్ప‌టికీ ఇమ్రాన్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏదో ఒక‌లాగా రాజ‌ధానికి చేరుతున్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 2న ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్ర‌ధానికి చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు. ష‌రీఫ్‌ నియంతృత్వ ధోర‌ణికి అడ్డుక‌ట్ట‌వేస్తామ‌ని అన్నారు. ఇతర మార్గాల్లో త‌మ కార్య‌క‌ర్త‌లు ఇస్లామాబాద్ కు చేరుకోవాల‌ని సూచించారు. ఇదిలావుంటే, ఇమ్రాన్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయ‌డంతో పాక్‌లో టెన్ష‌న్ అలుముకుంది. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/