Begin typing your search above and press return to search.

తొలి నిర్ణ‌యంతోనే ఇమ్రాన్ సంచ‌ల‌నం!

By:  Tupaki Desk   |   20 Aug 2018 10:50 AM GMT
తొలి నిర్ణ‌యంతోనే ఇమ్రాన్ సంచ‌ల‌నం!
X
ప్ర‌ధానమంత్రి అంటే మాట‌లా? దేశ ప్ర‌జ‌లు ఎంత పేద‌రికంలో ఉంటే మాత్రం.. తాము మాత్రం డాబుగా.. ద‌ర్పంగా ఉండే విష‌యంలో అస్స‌లు వెనుకాడ‌రు. దేశ ప్ర‌ధాని హోదాలో త‌మ‌కు ల‌భించే విలాసాల్ని.. సౌక‌ర్యాల్ని త‌గ్గించుకోవ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. పాక్ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

తాను పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి అధికారిక నివాసంలో ఉండ‌న‌ని తేల్చి చెప్పారు. దానికి ఆయ‌న వినిపించిన వాద‌న వింటే నిజ‌మే క‌దా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఎందుకంటే.. పాక్ ప్ర‌ధానికి కేటాయించే అధికారిక భ‌వ‌నంలో 524 మంది ప‌ని వారు.. 80 కార్లు.. హెలికాఫ్ట‌ర్ తో స‌హా ప‌లు విలాసాలు ఉంటాయ‌ట‌.

కానీ.. అవ‌న్నీ త‌న‌కు అక్క‌ర్లేద‌ని ఇమ్రాన్ స్ప‌ష్టం చేశారు. వాస్త‌వానికి త‌న ఇంట్లోనే తాను ఉంటాన‌ని చెప్పాన‌ని.. అయితే భ‌ద్ర‌తా సిబ్బంది ఒప్పుకోలేద‌న్నారు. దేశం అప్పుల కుప్ప‌గా ఉంద‌ని.. అందుకే తాను పొదుపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. ప్ర‌ధానిగా త‌న తొలి అధికారిక ప్ర‌సంగంలో ఆయ‌న చెప్పిన మాట‌లు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. పాకిస్తానీయుల్ని ఫిదా అయ్యేలా చేశాయి.

సైన్యానికి చెందిన సెక్ర‌ట‌రీకి కేటాయించే ట్రిపుల్ బెడ్రూం ఇంట్లో తాను ఉండ‌నున్న‌ట్లు ఇమ్రాన్ ప్ర‌క‌టించారు. త‌న‌తో పాటు కేవ‌లం ఇద్ద‌రు సిబ్బందిని మాత్ర‌మే ఉంచుకుంటాన‌ని స్ప‌ష్టం చ‌శారు. ప్ర‌ధానికి పెద్ద బంగ్లాలు.. విలాస‌వంత‌మైన సౌక‌ర్యాలుఉన్నాయ‌ని.. మ‌రోవైపు పాక్ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం వెచ్చించేందుకు నిధులు లేవ‌న్న ఆయ‌న‌.. ప్ర‌జ‌లు దారుణ‌మైన ప‌రిస్థితులు గ‌డుపుతున్న వైనంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధాన‌మంత్రులు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు ఎంత డ‌బ్బు వెచ్చిస్తున్నారో చూడండి.. వీళ్లు 650 మిలియ‌న్ డాల‌ర్లు ఏం చేశారు? స్పీక‌ర్ 160 మిలియ‌న్ డాల‌ర్లు ఏం చేశారు? విదేశాల్లో ఆస్తులు కూడ‌బెట్టుకున్నారా? అంటూ మండిప‌డ్డారు. దేశ ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా తాను ఏ విధంగా ఖ‌ర్చులు త‌గ్గించుకుంటున్న‌ది ఇమ్రాన్ వెల్ల‌డించారు. నిఘా వ‌ర్గాల కోసం తాను రెండు కార్ల‌ను మాత్ర‌మే ఉంచుకుంటున్న‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వ భ‌వ‌నాల కోసం వీలైనంత త‌క్కువ ఖ‌ర్చు పెట్టాల‌ని.. ప్ర‌ధాని అధికారిక బంగ్లాను రీసెర్చ్ వ‌ర్సిటీగా మార్చాల‌ని ఆదేశించారు. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించేందుకు ఒక క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తానికి త‌న మొద‌టి అధికారిక ప్ర‌సంగంలోనే ఇమ్రాన్ సంచ‌ల‌న నిర్ణ‌యాల్ని తీసుకున్నార‌ని చెప్పాలి.