Begin typing your search above and press return to search.

ఏపీలో 'సంక్షేమ రాజ‌కీయం'.. పార్టీల‌ది కాదు.. ప్ర‌జ‌ల‌దే..!

By:  Tupaki Desk   |   23 Dec 2022 5:30 AM GMT
ఏపీలో సంక్షేమ రాజ‌కీయం.. పార్టీల‌ది కాదు.. ప్ర‌జ‌ల‌దే..!
X
ఏపీలో మ‌రోసారి సంక్షేమం చుట్టూ రాజ‌కీయం తిరుగుతోంది. అయితే.. ఇది ఇప్పుడు రాజ‌కీయ పార్టీల‌కు కాకుండా.. ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం పార్టీల నాయ‌కులు.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. అంతేకాదు.. వారిని త‌మ‌కు ఓటేయాలంటే.. త‌మ‌కే వేయాల‌ని కూడా కోరుతున్నారు. అయితే.. ఇక్క‌డ ప్ర‌జ‌ల నుంచి వినూత్న‌మైన స్పంద‌న క‌నిపిస్తోంది.

అంతేకాదు.. గ‌తానికి భిన్నంగా ఇప్పుడు ప్ర‌జ‌లు త‌మ వాయిస్ వినిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇస్తున్న పింఛ‌న్ ను రూ.5000ల‌కు పెంచాల‌ని.. త‌మ‌కు ఇళ్లు ఇవ్వాల‌ని.. రేష‌న్ కార్డులు ఇవ్వాల‌ని.. వారు కోరుతున్నారు.

ఇందులో ప్ర‌ధానంగా.. ఇత‌ర డిమాండ్ల‌ను ప‌క్క‌న పెట్టినా.. పింఛ‌ను పెంచాల‌నే డిమాండ్ మాత్రం స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇది సామాజికంగానే కాకుండా.. ఇత‌ర పింఛ‌న్లు కూడా పెంచాల‌ని కోరుతున్నారు.

అంతేకాదు.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ఇస్తున్న ప‌థ‌కాల‌ను మ‌ళ్లీ పొడిగించాల‌ని.. అమ్మ ఒడిని రూ.25 వేలు చేయాల ని కూడా ఇటీవ‌ల మంత్రి తానేటి వ‌నిత‌ను కొంద‌రు మ‌హిళ‌లు కోరారు.

ఇదే విష‌యాన్ని చిత్తూరులో మంత్రి నారాయ‌ణ స్వామి ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు కూడా ఒక హ‌ద్దు ఉండాలి! అని వ్యాఖ్యానించారు. ప‌రోక్షంగా ఆయ‌న ప‌శ్చిమ‌లో ప్ర‌జ‌ల డిమాండ్‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

ఇక‌, టీడీపీ నేత‌ల‌కు కూడా ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. చాలా చోట్ల ప్ర‌స్తుతం ఉన్న ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తారా? లేదా? అనే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. అంతేకాదు.. ఇప్ప‌టి క‌న్నా బాగా ఇస్తామ‌ని త‌మ్ముళ్లు చెబుతుంటే.. అమ్మ ఒడి ఉంటుందా? చేయూత ఇస్తారా? అంటూ గుచ్చి గుచ్చి ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమ రాజ‌కీయం రాజ‌కీయ నేత‌ల‌కే ప‌రిమితం అయితే..ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు కూడా ప‌ట్టుకుంద‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.